Flashback 2024: 2024 ఐపీఎల్ సీజన్ రికార్డుల జాతరను తలపించింది. లెక్కకు మిక్కిలి రికార్డులతో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. అత్యధిక స్కోరు నుంచి మొదలు పెడితే అత్యధిక సిక్సులు, అత్యధిక సెంచరీలు, హయ్యెస్ట్ ఛేజింగ్ ఇలా చాలా ఘనతలు ఈ సీజన్లోనే రికార్డయ్యాయి. ఇక ఈ సీజన్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్ రైజర్స్ సరికొత్త రూపుతో వచ్చి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది. ఏకంగా ఫైనల్ కు దూసుకెళ్లి అభిమానులకు పండుగ తెచ్చింది. మరి ఈ ఏడాది నమోదైన రికార్డులను చూద్దామా..!!
కోల్ కతా నైట్ రైజర్స్: ఈ సీజన్లో కప్పు గెలిచి, మూడు సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా చైన్నై, ముంబై సరసన చేరింది. ఫైనల్లో సన్ రైజర్స్ ను ఓడించింది.
1200కిపైగా సిక్సులు: ఈ సీజన్లో అత్యధిక సిక్సులు నమోదయ్యాయి. బ్యాటర్లు విశ్వరూపం చూపించడంతో ఏకంగా 1260 సిక్సులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2023, 2022లో మాత్రమే వెయ్యికి పైగా సిక్సర్లు నమోదయ్యాయి.
సెంచరీల జాతర: ఈ సీజన్లో బ్యాటర్లు రెచ్చిపోవడంతో శతకాలు వెల్లు వెత్తాయి. ఓవరాల్ గా 14 సెంచరీలు నమోదయ్యాయి. జోస్ బట్లర్ రెండు సెంచరీలు చేయగా, విల్ జాక్స్, జానీ బెయిర్ స్టో, సూర్య కుమార్ యాదవ్, సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, సునీల్ నరైన్; రుతరాజ్ గైక్వాడ్, ట్రావిస్ హెడ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మార్కస్ స్టొయినిస్, యశస్వి జైస్వాల్ తలో సెంచరీ చొప్పున శతకాల మోత మోగించారు. గత సీజన్లో కేవలం 10 సెంచరీలు నమోదు కావడం విశేషం.
42 సిక్సర్లు: ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదైన ఘటన ఈ సీజన్లోనే జరిగింది. పంజాబ్, కోల్ కతా మధ్య జరిగిన మ్యాచ్ లో 42 సిక్సర్లు నమోదయ్యాయి. ఇక ముంబై-హైదరాబాద్, బెంగళూరు-హైదరాబాద్ మధ్య 38 సిక్సర్ల చొప్పున నమోదయ్యాయి. ఇక ఆర్సీబీ-హైదరాబాద్ మ్యాచ్ లో 549 పరుగులు రికార్డయ్యాయి. ఒక టీ20 మ్యాచ్ లో ఇదే అత్యధికం కావడం విశేషం.
ఆర్సీబీ మ్యాజిక్: తొలి ఎనిమిది మ్యాచ్ ల్లో ఒక్కటి గెలిచిన క్లిష్టమైన స్థితిలో.. ఫ్లే ఆఫ్స్ కి వెళ్లిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. టోర్నీ ఫస్టాఫ్ లో ఎనిమిది మ్యాఛ్ ల్లో ఒక్క విజయం సాధించిన ఆర్సీబీ.. తర్వాత ఆరు మ్యాచ్ లను నెగ్గి, అనూహ్యంగా నాకౌట్ బెర్త్ దక్కించుకుంది.
15 బంతుల్లో ఫిఫ్టీ: ఆసీస్ ప్లేయర్ జాక్ ఫేసర్ మెక్ గర్క్ ఈ సీజన్లో జాదూ చేశాడు. టోర్నీ చరిత్రలోనే 15 బంతుల్లో ఫిఫ్టీ బాదిన తొలి ప్లేయర్ గా రికార్డులకెక్కాడు. ఇక ఈ సీజన్ లో నాలుగుసార్లు ఫిఫ్టీలు చేసిన జాక్.. అందులో మూడు 19 బంతుల్లోపలే చేసినవి కావడం విశేషం.
హయ్యెస్ట్ ఛేజింగ్: టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేదన రికార్డు ఈ సీజన్లోనే నమోదైంది. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ ఛేదించింది. నిజానికి టీ20 చరిత్రలోనే అత్యధిక ఛేదన కావడం గమనార్హం. ఇక రాజస్తాన్ కూడా కోల్ కతా పైనే 224 పరుగులను ఛేజ్ చేసి రెండో అత్యధిక ఛేదనను నమోదు చేయడం విశేషం.
సన్ రైజర్ పవర్ గేమ్: పవర్ ప్లేలో టాప్ 2 స్కోర్లు ఈ సీజన్లోనే నమోదయ్యాయి. ఢిల్లీపై 125/0, లక్నోపై 107/0తో హైదరాబాద్ చరిత్ర సృష్టించంది. (అభిమానులు ముద్దుగా సన్ రైజర్స బ్యాటర్లను పిలుచుకునే) కాటేరమ్మ కొడుకుల ధాటికి ప్రత్యర్థి బౌలర్లు అల్లాడి పోయారు. అలాగే పవర్ ప్లేలో అత్యదిక రేటు 11.7ను సన్ నమోదు చేసింది. ఇక పవర్ ప్లేలో 59 సిక్సర్లు కొట్టిన ఘనత కూడా హైదరాబాద్ కే దక్కింది. అలాగే ఈ సీజన్లో మూడుసార్లు 250+ మార్కును సన్ దాటింది. ఆర్సీబీపై టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు 287/3 నమోదు చేయగా, ముంబైపై 277/3, ఢిల్లీపై 266/7 స్కోరు చేసింది.
రికార్డు ఛేజింగ్: హైదరాబాద్ రికార్డుల జోరు టోర్నీలో అలా సాగుతూనే ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్ లో 166 పరుగుల టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలో అలా ఊదేసింది. పది ఓవర్లలో ఓ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం.
కింగ్ కోహ్లీ ఊచకోత: భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సీజన్లోనే 8వేల పరుగుల ఐపీఎల్ మార్కును దాటాడు. అలాగే ఎనిమిదో సెంచరీని కూడా చేశాడు.
ఇక సునీల్ నరైన్.. ఒక మ్యాచ్ లో సెంచరీతోపాటు కనీసం ఒక వికెట్ తీసిన అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సీజన్లో మల్లిపుల్ ఫైఫర్లను సాధించిన బౌలర్ గా భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డులకెక్కాడు. ఇక మార్కస్ స్టొయినిస్.. ఛేదనలో టోర్నీ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. ఇలా అద్భుతమైన రికార్డులతో అభిమానులకు ఫుల్లు మాజనిచ్చింది ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.