IPL 2024 points table : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)లో ఇప్పటికే 46 మ్యాచ్‌లు ముగిశాయి. ప్లే ఆఫ్ కోసం జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB) ఆలస్యంగా పుంజుకోగా.... ముంబై(MI) కూడా ప్లే ఆఫ్‌ ఆశలు నిలబెట్టుకునేందుకు పోరాడుతోంది. రాజస్థాన్‌ రాయల్స్‌(RR), కోల్‌కత్తా(KKR) వరుస విజయాలతో ప్లే ఆఫ్‌కు సమీపిస్తుండగా... దూకుడుగా ఆడుతున్న  హైదరాబాద్‌ కూడా వరుసగా రెండు పరాజయాలతో డీలా పడి ప్లే ఆఫ్‌ రేసును సంక్లిష్టం చేసుకుంది. చెన్నై కూడా అదే దారిలో పయనిస్తోంది. ఈ దశలో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నది ఎవరు..? ఆరెంజ్‌, పర్పుల్‌ క్యాపులు ఎవరి దగ్గర ఉన్నాయి.? అనే అంశాలపై ఓ లుక్కేద్దాం...


పాయింట్ల పట్టికలో ఇలా...
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 78 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్.... భారీ విజయాన్ని నమోదు చేసింది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్‌ కుప్పకూలింది. ఈ గెలుపుతో చెన్నై సూపర్‌కింగ్స్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. చెన్నై చేతిలో భారీ ఓటమితో ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై, హైదరాబాద్‌, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు విజయాలతో 10 పాయింట్లతో ఉండడం ఆసక్తి రేపుతోంది. అయిదు జట్లు కూడా పదే పాయింట్లతో ఉన్నా నెట్‌ రన్‌రేట్‌ కారణంగా జట్ల స్థానాలు మారాయి. కోల్‌కతా నైట్ 0.972,  చెన్నై సూపర్ కింగ్స్ 0.81 4, సన్‌రైజర్స్ హైదరాబాద్ 0.075, లక్నో సూపర్ జెయింట్స్ 0.059,  ఢిల్లీ క్యాపిటల్స్ -0.276 నెట్‌ రన్‌రేట్‌ కలిగి ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ ఎనిమిది పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో ఉండగా...  పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 


విరాట్‌, బుమ్రా దగ్గరే...
ఐపీఎల్‌లో బెంగళూరు బ్యాటర్‌, కింగ్ కోహ్లీ 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్‌  దగ్గరే ఆరెంజ్‌ క్యాప్‌ ఉంది. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ 71.42 సగటుతో సరిగ్గా 500 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో కోహ్లీ అత్యధిక స్కోరు 113 నాటౌట్‌. తర్వాతి రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. రుతురాజ్‌ 63.85 సగటుతో 447 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రుతురాజ్‌ కేవలం రెండు పరుగులతో సెంచరీని చేజార్చుకున్నాడు. మూడో స్థానంలో సాయి సుదర్శన్ ఉన్నాడు. ఈ గుజరాత్‌ ఆటగాడు 46.44 సగటుతో 418 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్‌ అత్యధిక స్కోరు 84.  ఇక బౌలింగ్‌లో బుమ్రానే అగ్రస్థానంలో ఉన్నాడు. బుమ్రా ఇప్పటివరకూ 14 వికెట్లు తీశాడు. పర్పుల్‌ క్యాప్‌ బుమ్రా దగ్గరే ఉంది. బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన 5/21. తర్వాతి స్థానంలో చెన్నై బౌలర్‌ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఉన్నాడు. రెహ్మాన్‌ కూడా 14 వికెట్లు నేలకూల్చాడు. పంజాబ్‌ బౌలర్‌ హర్షల్ పటేల్ కూడా 14 వికెట్లు తీశాడు. కానీ పరుగులు తక్కువగా ఇచ్చిన బుమ్రానే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరి తర్వాతి స్థానాల్లో మతీషా పతిరాణ 13 వికెట్లు, నటరాజన్ 13 వికెట్లు ఉన్నారు.