IPL 2024 playoffs qualification race: ఐపీఎల్‌ 2024(IPL 2024) సీజన్‌ చివరి దశకు చేరుకుంది. లీగ్‌ మ్యాచులు చివరి దశకు చేరినా ఇంకా ప్లే ఆఫ్స్‌కు చేరిన ఆ నాలుగు జట్లేవో అన్నదానిపై స్పష్టత రాలేదు. మొదటి నాలుగు స్థానాల్లో కేవలం కోల్‌కత్తా(KKR) ఒక్కటే ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టింది. ఇంకా మిగిలిన మూడు జట్లు ఏవీ అన్నదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. పాయింట్ల పట్టికలో కోల్‌కత్తా ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతూ ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గుజరాత్‌ టైటాన్స్‌(GT), ముంబై ఇండియన్స్(MI), పంజాబ్ కింగ్స్(PBKS) రేసు నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఇక మిగిలింది ఆరు జట్లు. మిగిలిన మూడు స్థానాల కోసం ఈ ఆరు జట్లు తలపడుతున్నాయి. నెట్‌ రన్‌రేట్‌, విజయాలు, ఘన విజయాలు వంటి లెక్కలు వేసుకుంటూ ప్లే ఆఫ్స్‌ స్థానం దక్కించుకునే దిశగా దూసుకుస్తున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా మారింది. ఈ ఆరు జట్ల అవకాశాలపై ఓ లుక్కేద్దాం...




 

రాజస్థాన్ రాయల్స్

రాజస్థాన్‌(RR) ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది విజయాలు సాధించి 16 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. రాజస్థాన్‌ నెట్ రన్ రేట్ 0.349. రాజస్థాన్‌ ఇంకా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచుల్లో గెలిచినా రాజస్థాన్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. రెండూ ఓడిపోయినా ఇతర జట్ల జయాపజయాలపై రాజస్థాన్‌ అవకాశాలు ఆధారాపడి ఉంటాయి. సంజూ శాంసన్ సేన ఇంకా ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్‌ చేరుకుంటుంది. 

 

చెన్నై సూపర్ కింగ్స్

చెన్నై సూపర్ కింగ్స్(CSK) పాయింట్ల పట్టకలో మూడో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్‌ గైక్వాడ్‌ సేన 14 పాయింట్లు, 0.528 NRRతో ప్లే ఆఫ్‌ రేసులో ఉంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై బెంగళూరుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లే-ఆఫ్‌కు అర్హత సాధించే అవకాశం మెరుగుపడుతుంది. ఒకవేళ చెన్నై చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడితే, మంచి నెట్ రన్ రేట్ కారణంగా ప్లే ఆఫ్‌ చేరుకోవచ్చు. కానీ అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. 

 

సన్‌రైజర్స్ హైదరాబాద్

సన్‌రైజర్స్‌(DRH) ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో నెట్‌ రన్‌రేట్‌ 0.406 తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ ఇంకా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లో గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ఒకటి మాత్రమే గెలిస్తే, ఇతర జట్ల విజయాలు, సమీకరణాలు ప్రభావం చూపుతాయి. కానీ రెండు మ్యాచుల్లో విజయం సాధించాలని హైదరాబాద్‌ గట్టి పట్టుదలతో ఉంది. 

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఐపీఎల్ రెండో అర్ధభాగంలో వరుసగా  అయిదు విజయాలు సాధించి మంచి ఊపు మీదున్న బెంగళూరు(RCB) ప్లే ఆఫ్‌ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో నెట్‌ రన్‌రేట్‌ 0.387తో బెంగళూరు  ప్లేఆఫ్స్ రేసులో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న బెంగళూరు.. చెన్నై సూపర్ కింగ్స్‌తో చివరి మ్యాచ్ ఆడనుంది. దీంట్లో బెంగళూరు గెలిస్తే చెన్నైతో పాటు 14 పాయింట్లు సాధిస్తుంది. ఇతర సమీకరణాలు అన్నీ కలిసి వస్తే బెంగళూరు ప్లేఆఫ్స్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. 

 

ఢిల్లీ క్యాపిటల్స్

ఢిల్లీ క్యాపిటల్స్(DC) 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో నెట్‌ రన్‌రేట్‌ 0.482తో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ టీమ్ లక్నోతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచి, ఇతర సమీకరణాలు కూడా కలిసి వస్తే ఢిల్లీ ప్లేఆఫ్స్ చేరుకోవచ్చు. 

 

లక్నో సూపర్ జెయింట్స్

లక్నో(LSG) 12 మ్యాచుల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగిలిన రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లోనూ గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని రాహుల్‌ సారథ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ భావిస్తోంది. చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఢిల్లీ, ముంబైతో చివరి రెండు మ్యాచ్‌లు ఆడాల్సిన లక్నో, ఈ రెండూ గెలిచి, నెట్ రన్ రేట్ భారీగా మెరుగుపర్చుకుంటే ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయగలదు.