GT Vs KKR, IPL 2024 HIGHLIGHTS | గుజరాత్, కోల్ కత్తా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దు అయింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం లో సోమవారం రాత్రి జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలగింది. ఐపీఎల్ 2024లో భాగంగా ఇది 63వ మ్యాచ్. కానీ అహ్మదాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఓవర్లు కుదించి మ్యాచ్ నిర్వహించాలని భావించారు.






 వర్షం కారణంగా నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్ టాస్ సైతం పడలేదు. చివరకు 10:40 ప్రాంతంలో కేకేఆర్, గుజరాత్ మ్యాచ్ రద్దు చేసినట్లు ప్రకటించారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పై విజయవంతో కో‌ల్ కత్తా ఇదివరకే ప్లే ఆఫ్ కు క్వాలిఫై అయింది. మరోవైపు వరుస రెండు మ్యాచ్ లలో నెగ్గి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని భావించిన గుజరాత్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. 


గుజరాత్ ఆశలపై వరుణుడు నీళ్లు 
ఐపీఎల్ 2024 పాయింట్స్ టేబుల్ లో గుజరాత్ టైటాన్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. 12 మ్యాచ్ లలో 5 నెగ్గి 10 పాయింట్లతో ఉన్న గుజరాత్.. లీగ్ దశలో చివరి రెండు మ్యాచ్ లు నెగ్గాలనుకుంది. కానీ వర్షం కారణంగా మరో లీగ్ మ్యాచ్ ఉండగానే గుజరాత్ ఇంటిదారి పట్టింది.  డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై 35 పరుగుల తేడాతో గత మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు నెగ్గి ఉత్సాహంతో ఉంది. పటిష్ట సీఎస్కే టీమ్ పై శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ సెంచరీలు సాధించడంతో గుజరాత్ 231/3 భారీ స్కోరు చేసింది. మరోవైపు మోహిత్ శర్మ (3/31), ఇతర బౌలర్లు రాణించడంతో చెన్నై 196/8కి పరిమితం అయింది.