MI vs RR Match Preview: నూతన సారధి హార్దిక్ పాండ్యా నేతృత్వంలో ముంబై ఇండియన్స్(MI) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. సొంత మైదానం వాంఖడేలో రాజస్థాన్ రాయల్స్(RR)తో హార్దిక్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఏ మూహూర్తాన కెప్టెన్‌గా రోహిత్‌ను తొలిగించి హార్దిక్ పాండ్యాను నియమించారో కానీ అప్పటినుంచి ముంబైకి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటివరకూ ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ముంబై ఓడిపోవడంతో హార్దిక్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. ఆటగాడిగా రాణించని పాండ్యా.. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్... హార్దిక్‌కు చాలా కీలకంగా మారనుంది. ముంబై ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోగా... రాజస్థాన్ మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి జైత్రయాత్ర కొనసాగించాలని రాజస్థాన్ చూస్తుండగా.... గెలుపు బాట పట్టాలని ముంబై వ్యూహాలు రచిస్తోంది.
పాయింట్ల పట్టికలో చివరి స్థానం
ఐపీఎల్ టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇప్పుడు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఇవి తొలి దశ మ్యాచ్‌లే అయినా ముంబై లాంటి భీకర జట్టుకు రెండు మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వడమే ఫ్యాన్స్‌ను ఆందోళన పరుస్తోంది. ముంబై నెట్ రన్‌రేట్ కూడా ఘోరంగా -0.925గా ఉంది. అన్ని జట్టలో ఇదే తక్కువ రన్‌రేట్ కావడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ లేకపోవడం ముంబై బ్యాటింగ్ లయను దెబ్బతీస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో తమ చివరి ఐదు మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు విజయం సాధించింది. కానీ ఇప్పుడు రాజస్థాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. సంజూ శాంసన్ జట్టు రెండు మ్యాచుల్లో గెలవడంతో ముంబైకి కూడా కఠిన సవాల్ తప్పకపోవచ్చు. ముంబైకి మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం రావాల్సి ఉంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ నుంచి ముంబై జట్టు భారీ స్కోర్లు ఆశిస్తోంది. జస్ప్రీత్ బుమ్రాను పాండ్యా సరైన సమయంలో వాడుకోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఈ లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. బుమ్రా, పీయూష్ చావ్లాలు బౌలింగ్‌లో రాణిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో అపారమైన అనుభవం కలిగిన స్థానిక కుర్రాడు షమ్స్ ములానీ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నమన్ ధీర్‌లు కూడా భారీ స్కోర్లపై కన్నేశారు.
శాంసన్ రాణిస్తే..
ఐపీఎల్‌లో శాంసన్ రాణిస్తుండడం రాజస్థాన్‌కు కలిసిరానుంది. యశస్వి జైస్వాల్ ఈ సీజన్‌లో ఇంతవరకూ భారీ స్కోరు చేయలేదు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోరు చేయాలని యశస్వీ పట్టుదలగా ఉన్నాడు. రియాన్ పరాగ్ గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌కు విజయం అందించాడు. జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌ల స్పిన్ ద్వయాన్ని ఎదుర్కోవడం ముంబైకు కష్టమే.
జట్లు
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్, క్వేనా మఫకా, మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్, సూర్యకుమార్ యాదవ్.
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, జోస్ బట్లర్, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నాంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మెయర్, శుభమ్ దూబే, రోవ్‌మన్ పావెల్, టామ్ కొహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కొటియన్.