MI vs CSK Mumbai Indians opt to bowl: ఈ ఐపీఎల్‌(IPL 2024)లోనే   హై ఓల్టేజ్‌ మ్యాచ్‌గా భావిస్తున్న పోరులో చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)ను ముంబై ఇండియన్స్‌(MI) బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కష్టమని భావిస్తున్న వేళ టాస్‌ గెలిచిన ముంబై బౌలింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిస్తే తాము కూడా తొలుత బౌలింగే తీసుకునే వాళ్లమని టాస్‌ సందర్భంగా చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ వ్యాఖ్యానించాడు. మిస్టర్‌ కూల్‌, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్‌ అని వార్తలు వస్తున్న వేళ వాంఖడేలో మహీ చివరి మ్యాచ్‌ను ఆడనున్నాడు. ముంబైలోని వాంఖడేలో జరిగే ఈ మ్యాచ్‌లో మొదటిసారి ధోనీ... కెప్టెన్‌గా కాకుండా కేవలం ఆటగాడిగా బరిలోకి దిగుతున్నాడు. 42 ఏళ్ల వయసులో కీపింగ్‌లో అదరగొడుతున్న ధోనీ... బ్యాట్‌తో కూడా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ ధోనీపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య పోరు అభిమానులకు అసలు మజాను పంచనుంది. ఈ మ్యాచ్‌ రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. 


 

చూపంతా ధోనీపైనే... 

ముంబైతో జరిగే మ్యాచ్‌లో క్రికెట్‌ ప్రేమికుల చూపంతా మహేంద్రసింగ్‌ ధోనిపైనే ఉంది. తన వ్యూహాలతో మరోసారి ముంబైకి చెక్‌ పెట్టేందుకు ధోని సిద్ధంగా ఉన్నాడు. ఈ సీజన్‌లో రెండు పరాజయాలను చవిచూసిన చెన్నై... ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని పట్టుదలగా ఉంది. ఈ రెండు జట్ల మధ్య ఓ సారూప్యత అభిమానులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌గా ధోనీ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ బాధ్యతలు స్వీకరించగా... ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌, రహానే, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ధోనీలతో చెన్నై బ్యాటింగ్‌ చాలా దుర్భేద్యంగా ఉంది. శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, జడేజా, రచిన్‌ రవీంద్రలతో బౌలింగ్‌ కూడా పర్వాలేదనిపిస్తోంది. దీనికి అదనంగా ధోనీ వ్యూహాలు ఉండనే ఉన్నాయి. వాంఖడే మైదానంలో తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 220కు పరుగులు సాధిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉంది. 

 

ఆత్మ విశ్వాసంతో ముంబై 

ఈ ఐపీఎల్‌ను పరాజయాలతో ప్రారంభించిన ముంబై వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి గాడినపడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ వచ్చిన తర్వాత ముంబై బ్యాటింగ్‌ చాలా బలంగా మారింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్య విధ్వంసమే సృష్టించాడు.  కేవలం 17 బంతుల్లో అర్ధశతకం చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఇప్పుడు చెన్నైపై సూర్య ఎలా ఆడతాడో వేచి చూడాలి. వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో దాదాపు 200 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో నాలుగు ఓవర్లు ఉండగానే ఛేదించింది. ముంబై బ్యాటర్లను చెన్నై బౌలర్లు ఎలా నిలువరిస్తారో చూడాలి. ఇషాన్ కిషన్ 161 పరుగులు, రోహిత్ విధ్వంసం, పాండ్యా లతో ముంబై బ్యాటింగ్‌ కూడా బలంగానే ఉంది. కానీ ముంబై జట్టు బౌలింగ్ భారాన్ని పేస్‌ స్టార్‌ బుమ్రా ఒక్కడే మోస్తున్నాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అయిదు వికెట్లు తీసి తాను ఎంత ప్రమాదకర బౌలర్‌నో మరోసారి బుమ్రా చాటిచెప్పాడు. బుమ్రా యార్కర్లను, లైన్ అండ్‌ లెంగ్త్‌ను చెన్నై బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.