IPL 2024 Records Telugu News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు వేళయ్యింది. తమ అభిమాన ఆటగాళ్లు, తమ అభిమాన టీంలు అంటూ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మొత్తం ఈ లీగ్ కోసమే ఎదురుచూస్తున్నారు. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరగబోయే మ్యాచ్‌తో ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభం కానుంది. అయితే ప్రతీ ఏడాది ఈ లీగ్‌లో రికార్డ్‌లు బద్ధలవుతూనే ఉన్నాయి. కొత్త రికార్డ్‌లు నమోదవుతూనే ఉన్నాయి. ఐపీయల్ కి ఇంకా 9రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఐపీయల్ లో 9 నంబర్ పేరు మీద ఉన్న టాప్-10 రికార్డ్‌లు ఓ సారి పరిశీలిద్దాం.
కోల్ ''కథానాయకులు''
ఐపీయల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అత్యధిక కెప్టెన్లతో ఇప్పటివరకు టోర్నమెంట్‌లో ఆడింది. మెత్తం 9 కెప్టెన్లతో కోల్‌కతా ఈ ఘనత సొంతం చేసుకొంది. 2008 లో మొదట సౌరభ్‌గంగూలీ నాయకత్వం వహించగా తరువాత మెక్‌కల్లం, గౌతమ్ గంభీర్, జాక్ కలిస్, దినేశ్‌కార్తీక్, మోర్గాన్ , శ్రేయస్ అయ్యర్, నితీష్‌రాణా లు వరుసగా 2023 వరకు కెప్టెన్సీ చేయగా 2024లో మళ్లీ శ్రేయస్ అయ్యర్ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. తీతో 9 మంది కెప్టెన్లు కలిగిన టీం గా కోల్‌కతా నిలిచింది.
పంత్ స్టైల్ వేరు
ఐపీయల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ విభాగంలో 9వ ఆటగాడి స్థానంలో ఉన్నాడు రిషబ్ పంత్. 2018 మే 10న జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైద్రాబాద్ బౌలర్ల పై ఏ మాత్రం దయ చూపించకుండా పంత్ విరుచుకుపడ్డాడు. ఆ ఇన్నింగ్స్‌లో 7 సిక్సర్లు, 15 ఫోర్ల సాయంతో 128 పరుగుల చేశాడు. అది కూడా కేలం 63 బంతుల్లోనే. పంత్ స్ర్టైక్‌రేట్ 203.17. ఈ ఇన్నింగ్స్ లో పంత్ ఒంటి చేత్తో కొట్టిన సిక్స్ మ్యాచ్‌కే హైలెట్ గా నిలిచింది.
9 ప్లేస్‌లో జడేజా
ఐపీయల్ లో ఎక్కువ వికెట్లు తీసిన వారిలో రవీంద్ర జడేజా తొమ్మిదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 152 వికెట్లు తీసిన ఈ లెప్ట్‌హ్యాండర్ స్పిన్నర్... అందుకు 197 ఇన్నింగ్స్ మాత్రమే ఉపయోగించుకొన్నాడు. 7.60 ఎకానమీతో బౌలింగ్ చేసే జడేజా ప్రపంచ అత్యుత్తమ ఫీల్డర్ కూడా. 16 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ఐపీయల్ లో తన అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు సర్‌రవీంద్ర జడేజా. ఇక ఈ సారి తనున్న ఫామ్ ప్రకారం చూస్తే ఈ సీజన్‌లోతన స్థానం మరింత మెరుగుపరుచుకోవడం ఖాయం.
డకౌట్ రికార్డు అంబటిరాయుడిదే
ఐపీయల్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయ్యిన తొమ్మిదవ ఆటగాడిగా కొనసాగుతున్నాడు తెలుగు క్రికెటర్ అంబటిరాయుడు. ముంబై, చెన్నై ప్రాంచెజీల తరఫున అధ్బుత ప్రదర్శనలు ఇచ్చిన రాయుడు ఇలా ఓ రికార్డు కూడా తన పేరిట లిఖించుకొన్నాడు. 187 ఇన్నింగ్స్ లో ఇలా 14 సార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు రాయుడు. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించే సమయంలో ఇలా జరుగుతుంటుంది అని ఫ్యాన్స్ సమర్ధించుకొంటుంటారు.
డివిలియర్స్ రికార్డు ఇదే
మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ అత్యధిక సెంచరీల విభాగంలో 9వ స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ కాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఏబీ 2008లోఐపీయల్లో ఆరంగేట్రం చేశాడు. 2021 లో చివరి ఐపీయల్ ఆడేసమయానికి డివిలియర్స్ ఖాతాలో 3 సెంచరీలు ఉన్నాయి. ఈ విభాగంలో 9 వ స్థానంలో ఉన్నప్పటికీ ఐపీయల్ లో చాలా విలువైన ఇన్నింగ్స్ ఆడాడు ఏబీ.
స్ట్రైక్ రేట్‌లో క్రిస్ గేల్ ప్లేస్ ఇదే
విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ ఐపీయల్ లో ఎక్కువ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్న ఆటగాళ్లలో 9వ స్థానంలో ఉన్నాడు. గేల్ 148.96 సగటు తో ప్రత్యర్ధులని భయపెట్టడమే కాకుండా పనిలో పనిగా ఈ రికార్డ్‌ని కూడా తనఖాతాలో వేసుకొన్నాడు. ఐపీయల్ లో కోల్‌కతా, పంజాబ్, బెంగళూరు తరఫున ఆడిన గేల్ మ్యాచ్ మెదలైన కాసేపటికే సునామీ సృష్టించడం అలవాటు. అయితే, 2021 వరకు ఆడిన ఈ ఓపెనర్ మొదటినుంచి అదే ఆటతీరుతో అభిమానులని మెప్పించాడు.141 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు గేల్.
టీం స్కోర్‌లో ముంబైది 9వ ప్లేస్
ఐపీయల్ లో అత్యధిక టీం స్కోర్ విభాగంలో తొమ్మిదవ స్థానంలో ఉంది... ముంబై ఇండియన్స్. 2021 ఐపీయల్ అబుదాబీలో జరిగింది. అక్టోబర్ 8న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 9 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. సన్‌రైజర్స్ హైద్రాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఈ రికార్డ్ స్కోరు సాధించింది. ఓ పక్క వికెట్లు పడుతున్నా ముంబై బ్యాట్స్‌మెన్ స్కోర్ పెంచుతూనే ఉన్నారు. 11.75 రన్‌రేట్‌తో ఈ పరుగులు సాధించింది ముంబై.
గుజరాత్ టైటాన్స్ లెక్కే వేరు
గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం పూర్తిగా కనిపించిన మ్యాచ్ జైపూర్ వేదికగా జరిగింది, మ్యాచ్ గెలవడం ఇంత తేలికా అన్నట్లు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2023 మే 5 న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 118 పరుగులకే రాజస్థాన్ ని ఆలౌట్ చేసిన గుజరాత్.... తర్వాత 13.5 ఓవర్లలోనే 9 వికెట్లతో విజయం సాధించింది. తమదైన రోజున ఎలా విజృంభిస్తోమో అని
ప్రత్యర్ధి జట్లకు హెచ్చరికలూ పంపింది టైటాన్స్.
అంబటి రాయుడు పేరిట మరో రికార్డు
ఐపీయల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి జాబితాలో తొమ్మిదవ స్థానంలోఉన్నాడు అంబటి తిరుపతి రాయుడు. 2010 నుంచి 2023 వరకు ఐపీయల్ ఆడిన రాయుడు... 204 మ్యాచ్‌లాడి ఈ రికార్డ్ ఖాతాలో వేసుకొన్నాడు. మొత్తం 4348 పరుగులు తన ఖాతాలో ఉన్నాయి. చెన్నె,ముంబై తరఫున ఆడిన రాయుడు... మిడిలార్డర్ లో చాలా కీలక సభ్యుడు.
సంజూ శాంసన్ రికార్డు లెక్క ఇదే
రాజస్థాన్ రాయల్స్ వికెట్‌కీపర్ సంజూ శాంసన్ ఐపీయల్ లో వికెట్‌కీపర్ గా అత్యధిక వికెట్లు పడగొట్టిన కీపర్ జాబితా లో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు. 2013 నుంచి టోర్నమెంట్‌లో ఉన్న సంజూ 93 ఇన్నింగ్స్‌ల్లో 68 బ్యాట్స్‌మెన్లను ఔట్‌చేశాడు. ఇందులో 53 మందిని క్యాచ్ రూపంలో పెవిలియన్ పంపగా 15 మందిని స్టంపౌట్ చేశాడు. వికెట్‌కీపింగ్ చేస్తూ కెప్టెన్ గా ఫీల్డింగ్ సెట్ చేస్తూ కనిపించే శాంసన్ ఈ సారి వికెట్‌కీపర్ జాబితాలో తన స్థానం మెరుగుపరుచుకోవడం ఖాయం.