Jasprit Bumrah puts on a masterclass GT finish with 168for 6 : ముంబైతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ఓపెనర్లు శుభారంభం అందించినా తర్వాత బ్యాటర్లు విఫలమయ్యారు. సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్ పర్వాలేదనిపించడంతో గుజరాత్ 168 పరుగులు చేయగలిగింది.
గుజరాత్ బ్యాటింగ్ సాగిందిలా...
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌కు శుభారంభం దక్కింది. హార్దిక్ పాండ్య వేసిన మొదటి ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. శుభ్‌మన్ గిల్, వృద్ధీమాన్ సాహా మంచి ఆరంభమే ఇచ్చారు. 3 ఓవర్లకు 27 పరుగులు చేశారు. ఈ సమయంలో గుజరాత్‌కు జస్‌ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. జస్‌ప్రీత్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి సాహా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 19 పరుగులు చేసి సాహా అవుటయ్యాడు. శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడాడు. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ స్కోరు 47/1. ఈ సమయంలో గుజరాత్ కీలకమైన వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 31 పరుగులు చేసి ఔటయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో లాంగాన్‌లో రోహిత్ శర్మకు చిక్కాడు. 66 పరుగుల వద్ద గిల్ అవుటయ్యాడు. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న గెరాల్డ్ కొయెట్జీ మొదటి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ 12 ఓవర్‌లో చివరి బంతికి 17 పరుగులు చేసిన అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ను కొయెట్జీ అవుట్ చేశాడు. ఆ తర్వాత గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. డేవిడ్ మిల్లర్ (12), సాయి సుదర్శన్ (45) పరుగులు చేసి అవుటయ్యారు. బుమ్రా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ అవుటయ్యాడు. తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోవడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.
ఇదీ గత రికార్డ్
ముంబై, గుజరాత్ జట్ల మధ్య ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు జరిగితే ముంబై రెండు మ్యాచ్‌లు గెలుపొందితే, గుజరాత్ రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. చివరిసారి గత సీజన్‌లో తలపడినప్పుడు ముంబై 27 పరుగుల తేడాతో గెలిచింది. ఇక ఈ సీజన్‌లో మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌లు ఆడి 5 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. 3 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఇక ఈ మైదానంలో మెత్తం ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు జరిగితే మెదట బ్యాటింగ్ చేసిన టీం 3 సార్లు, రెండవసారి బ్యాటింగ్ చేసిన టీం 4 సార్లు గెలుపొందింది. అత్యధిక స్కోరు 207 పరుగులుగా ఉంది.
ఈ టీంల‌్లో అత్యధిక పరుగుల వీరులుగా సూర్యకుమార్ 139, శుభ్‌మన్‌గిల్114, డేవిడ్ మిల్లర్ 106 పరుగులతో ఉన్నారు. ఎక్కువ వికెట్లు సాధించిన వారిలో... రషీద్ 8 వికెట్లు తీయగా, పీయూష్ చావ్లా 4 వికెట్లు తీశారు. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ అత్యధిక స్కోర్ ముంబై ఇండియన్స్ మీదే చేసింది. గత 2023 సీజన్లోనే ఈ ఘనత సాధించింది గుజరాత్. 2023 మే 26న ముంబై ఇండియన్స్ తో అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లకు గుజరాత్ 233 పరుగులు సాధించింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ స్కోరు సాధించింది టైటాన్స్.