GT vs KKR Match  Preview and Prediction: ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌(KKR)తో గుజరాత్ టైటాన్స్‌(GT) కీలక పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్‌ నుంచి గుజరాత్‌ దూరం కానుంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌లో స్థానం ఖాయం చేసుకున్న కోల్‌కత్తాకు ఈ మ్యాచ్‌ చెలగాటంకాగా.... గుజరాత్‌కు మాత్రం ప్రాణ సంకటంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్‌ చేరకుండానే వెనుదిరగాల్సి ఉండడంతో... సర్వశక్తులు ఒడ్డి గెలవాలని గుజరాత్‌ పట్టుదలగా ఉంది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ఉన్న గుజరాత్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది.

 

గిల్‌, సుదర్శన్‌ మళ్లీ మెరిస్తేనే

చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన శుభ్‌మన్‌ గిల్‌, సాయి సుదర్శన్‌పై గుజరాత్‌ భారీ ఆశలు పెట్టుకుంది. గిల్, సాయి సుదర్శన్ జంట మరోసారి మెరిస్తే కోల్‌కత్తా చెక్‌ పెట్టొచ్చని గుజరాత్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచిన కోల్‌కత్తాను ఎదుర్కోవాలంటే గుజరాత్‌ అన్ని విభాగాల్లోనూ సత్తా చాటాల్సి ఉంది. ఐపీఎల్‌ చివరి దశకు చేరుకున్నా ఇంకా ఏడు జట్లు ప్లేఆఫ్ రేసులో ఉన్నాయంటే పోటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో ప్లే ఆఫ్‌ రేసులో కాస్త ముందు ఉండగా.... చెన్నై సూపర్‌కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 పాయింట్లతో ఉన్నాయి. మిగిలి ఉన్న రెండు మ్యాచుల్లో గుజరాత్‌ భారీ విజయాలు సాధించి... మిగిలిన జట్లు పరాజయం పాలైతే గుజరాత్‌ ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. కానీ గుజరాత్‌ బౌలింగ్‌లో అస్థిరత ఆ జట్టును వేధిస్తోంది. పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుండగా.... స్పిన్నర్లు పర్వాలేదనిపిస్తున్నారు. రషీద్ ఖాన్ మరోసారి మెరిస్తే కోల్‌కత్తాను కట్టడి చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. 

 

కోల్‌కత్తా బ్యాటర్లు నిలిస్తే...

 ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా 18 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్‌లో సునీల్ నరైన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే  461 పరుగులు చేయడంతోపాటు 15 వికెట్లు కూడా నేలకూల్చాడు. ఆల్‌రౌండ్ మెరుపులతో నరైన్‌ కోల్‌కత్తా జట్టులో కీలకంగా మారాడు. ఆండ్రీ రస్సెల్ ఈ సీజన్‌లో 222 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా తీశాడు. వరుణ్ చక్రవర్తి 18 వికెట్లతో మంచి లయలో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ కూడా సంచలనాత్మక ఆరంభాలు అందిస్తున్నాడు. రఘువంశీ, రమణదీప్ సింగ్ కీలక సమయాల్లో మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న కోల్‌కత్తాతో  గుజరాత్‌ పోరు రసవత్తరంగా సాగనుంది. 

 

జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), KS భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా గజన్ఫర్, ఫిల్ సాల్ట్.

 

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారుక్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మానవ్ సుతార్, స్పెన్సర్ జాన్సన్, సందీప్ వారియర్, శరత్.