IPL 2024 Dc Vs Srh Sunrisers Hyderabad won by 67 runs: ఐపీఎల్(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)జోరు కొనసాగుతోంది. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో సన్‌రైజర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటర్లు సునామీలా ప్రత్యర్థి బౌలర్లను ముంచెత్తడం... తర్వాత బౌలర్లు కట్టడి చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్న హైదరాబాద్ మరోసారి అదే చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఆరంభంలో సన్‌రైజర్స్ దూకుడు చూస్తే సునాయసంగా 300 పరుగులు చేస్తుంది అనిపించింది. కానీ ఢిల్లీ(DC) బౌలర్లు కాస్త పుంజుకోవడంతో 266 పరుగులకు పరిమితమైంది. అనంతరం 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ199 పరుగులే చేయగలిగింది. దీంతో హైదరాబాద్ 67 పరుగుల తేడాతో విజయం సాధించింది.
IPL 2024: హైదరాబాద్ బ్యాటర్ల పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ఢిల్లీ
ABP Desam
Updated at:
20 Apr 2024 11:28 PM (IST)
Edited By: Jyotsna
Dc Vs Srh : హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో సన్‌రైజర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. 67 పరుగుల తేడాతో ఢిల్లీ పై విజయం సాధించింది.
సన్‌రైజర్స్ వరుసగా నాలుగో విజయం ( Image Source : Twitter )
NEXT
PREV
ఊచకోతను మించి..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి విధ్వంసం సృష్టించారు. ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసంతో సన్‌రైజర్స్ స్కోరు బోర్డు ఆరంభంలో బుల్లెట్ ట్రైన్‌లా దూసుకుపోయింది. ట్రానిస్ హెడ్ 32 బంతుల్లో 89, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 46 పరుగులతో తుపాను ఇన్నింగ్స్ ఆడారు. షెహబాజ‌్ అహ్మద్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 , నితీశ్‌కుమార్‌రెడ్డి 27 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. పవర్ ప్లేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 125 పరుగులు. అంటే 36 బంతుల్లో హైదరాబాద్ 125 పరుగులు చేసింది. ట్రానిస్ హెడ్ ఊచకోత కోశాడు. ప్రత్యర్థి బౌలర్లు బంతులు వేసేందుకే భయపడేలా ట్రానిస్ హెడ్ చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌లో బెంగళూరుకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన హెడ్... ఇప్పుడు ఢిల్లీ బౌలర్లకు అంతకుమించిన నరకం చూపించాడు. శతకం చేయకపోయినా ట్రానిస్ హెడ్ సృష్టించిన సునామీలో ఢిల్లీ బౌలర్లు కాసేపు విలవిలలాడారు. కేవలం 32 బంతులు ఎదుర్కొన్న ట్రానిస్ హెడ్... 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. శతకం దిశగా సాగుతున్న హెడ్‌ను కుల్‌దీప్ యాదవ్ అవుట్ చేశాడు. ముకేశ్ కుమార్ వేసిన ఆరో ఓవర్‌లో ట్రానిస్ హెడ్ విశ్వరూపం చూపాడు. ఆ ఓవర్‌లో 22 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వరుసగా... 4, 4, 4, 4, 0, 6 బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 125 పరుగులకు చేరింది. నోకియా వేసిన మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాది 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్... సిక్సర్లు కొట్టడం ఇంత తేలిక అనేలా చేశాడు. ఐపీఎల్‌లో ఆరు ఓవర్లకు 105 పరుగుల రికార్డు హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో కాలగర్భంలో కలిసిపోయింది.
బౌండరీలే బౌండరీలు
ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసానికి మాటలే సరిపోలేదు. తొలి ఆరు ఓవర్లలో హైదరాబాద్ ఓపెనర్లు 11 సిక్సర్లు.. 13 ఫోర్లు కొట్టారంటే వారి బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరికీ బౌలింగ్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు భయపడిపోయారు. పవర్ ప్లేలో హైదరాబాద్ చేసిన 125 పరుగుల్లో 108 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, మార్క్రమ్‌ను అవుట్ చేసి పరుగులను కట్టడి చేశాడు. చివర్లో నితీశ్‌కుమార్‌రెడ్డి 27 బంతుల్లో 37 పరుగులు చేసి అవుటయ్యాడు. షెహబాజ‌్ అహ్మద్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 అజేయంగా నిలవడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
మెక్‌గుర్క్ మెరుపులు
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. 16 పరుగుల చేసి పృథ్వీ షా, ఒక పరుగుకే వార్నర్ వెనుదిరిగారు. దీంతో 25 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. కానీ మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్ మెరుపులు మెరిపించారు. మెక్‌గుర్క్ కేవలం 18 బంతుల్లో 7 సిక్సులు, 5 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. పోరెల్ 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. వీరి దూకుడుతో ఎనిమిది ఓవర్లకే స్కోరు 135 పరుగులకు చేరింది. కానీ వీరు వెంటవెంటనే అవుటవ్వడంతో సన్‌రైజర్స్ మళ్లీ పోటీలోకి వచ్చింది. చివర్లో పంత్ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
Published at:
20 Apr 2024 11:28 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -