Travis Head Score In Ipl Dc Vs Srh 35th Match Ipl 2024: ఐపీఎల్‌(IPL)లో సన్ రైజర్స్ ఓపెనర్ బ్యాటర్ ట్రానిస్‌ హెడ్‌(Travis Head ) ఊచకోత కొనసాగుతోంది. ప్రత్యర్థి బౌలర్లు బంతులు వేసేందుకే భయపడేలా ట్రానిస్‌ హెడ్‌ చెలరేగి పోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌లో బెంగళూరుకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన హెడ్‌... ఇప్పుడు ఢిల్లీ బౌలర్లకు అంతకుమించిన నరకం చూపించాడు. శతకం చేయకపోయినా ట్రానిస్‌ హెడ్‌ సృష్టించిన సునామీలో ఢిల్లీ బౌలర్లు కాసేపు విలవిలలాడారు.


కేవలం 32 బంతులు ఎదుర్కొన్న ట్రానిస్‌ హెడ్‌... 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. శతకం దిశగా సాగుతున్న హెడ్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేశాడు.  ముకేశ్‌ కుమార్‌ వేసిన ఆరో ఓవర్‌లో ట్రానిస్‌ హెడ్‌ విశ్వరూపం చూపాడు. ఆ ఓవర్‌లో 22 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వరుసగా... 4, 4, 4, 4, 0, 6 బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 125 పరుగులకు చేరింది. నోకియా వేసిన మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాది 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌... సిక్సర్లు కొట్టడం ఇంత తేలిక అనేలా చేశాడు. 


ఐపీఎల్‌ చరిత్రలో పవర్ ప్లే రికార్డు
ఈ ఐపీఎల్‌(IPL)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) ఆట చూస్తే.. మతిపోతోంది. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఓపెనర్ల విధ్వంసం హద్దులు దాటింది. పవర్ ప్లేలోనే 120 పరుగులు చేసి ఐపీఎల్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌లో ఆరు ఓవర్లకు 105 పరుగుల రికార్డు హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో కాలగర్భంలో కలిసిపోయింది. ట్రానిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ విధ్వంసానికి మాటలే సరిపోలేదు. తొలి ఆరు ఓవర్లలో హైదరాబాద్‌ ఓపెనర్లు 11 సిక్సర్లు.. 13 ఫోర్లు కొట్టారంటే వారి బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరికీ బౌలింగ్‌ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు భయపడిపోయారు. పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ చేసిన 125 పరుగుల్లో 108 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. 


రైజింగ్‌లో సన్ రైజర్స్‌
చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్ నిలకడగా రాణిస్తోంది. 2021, 2022లో 8వ, 2023లో ఏకంగా10వ స్థానానికి పరిమితమైన సన్‌రైజర్స్‌ ఈసారి ఫుల్‌ స్వింగ్‌లో ఉంది. ఎదురుదాడికి దిగుతూ బౌలర్లను ఉతికేస్తోంది. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఉతికి ఆరేస్తోంది. ముంబై ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరుపై పిడుగులా పడిన హైదరాబాద్‌ బ్యాటర్లు ఢిల్లీపైనా పంజా విసిరారు. ముంబైపై మెరుపు దాడి చేసి ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన హైదరాబాద్‌.. తమ బ్యాటింగ్‌ గాలివాటం కాదని బెంగళూరు మ్యాచ్‌తో ప్రత్యర్థి జట్లకు చాటిచెప్పింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టి ఔరా అనిపించింది.


ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్‌...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. ఇదే జోరు కొనసాగిస్తే మరో కప్పు సన్‌రైజర్స్‌ ఖాతాలో చేరడం ఖాయం.
Also Read: పవర్‌ ప్లేలో SRH విధ్వంసం, లీగ్ చరిత్రలో రికార్డ్ స్కోర్ చేసిన ట్రావిస్ హెడ్, అభిషేక్