Sunrisers next mission 300 ? : ఈ ఐపీఎల్(IPL 2024) సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH).. ప్రత్యర్థి జట్లను భయపెడుతోంది. తొలి బంతి నుంచి విధ్వంసంకర బ్యాటింగ్‌తో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ముంబైపై మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్...బెంగళూరుపై మూడు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసి పాత రికార్డును బద్దలుకొట్టింది. కేవలం 20 రోజుల వ్యవధిలోనే తాను సృష్టించిన రికార్డును తానే బద్దలు కొట్టి ఔరా అనిపించింది. ముంబైపై మెరుపు దాడి చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన హైదరాబాద్.. తమ బ్యాటింగ్ గాలివాటం కాదని బెంగళూరు మ్యాచ్‌తో ప్రత్యర్థి జట్లకు చాటిచెప్పింది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసి సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ బ్యాటర్లు... ఇప్పుడు మిషన్ 300 స్టార్ట్ చేశారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో 300 పరుగుల మార్క్‌ను చేరుకుని ఐపీఎల్ 17 ఏళ్ల సీజన్‌లో ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలవాలని హైదరాబాద్ బ్యాటర్లు పట్టుదలతో ఉన్నారు. ఓ వైపు ట్రానిస్ హెడ్ విధ్వంసం... మరోవైపు అభిషేక్ శర్మ మెరుపు దాడి, క్లాసెన్, మార్క్రమ్ ఊచకోత, అబ్దుల్ సమద్, నితీశ్‌రెడ్డి తుపాను ఇన్నింగ్స్‌లతో హైదరాబాద్ జట్టుకు 300 పరుగుల మార్క్ సాధ్యమే అనిపిస్తోంది. పటిష్టమైన ముంబై బౌలర్లను ఎదుర్కొని 277 పరుగులు చేసిన హైదరాబాద్... బెంగళూరు బౌలింగ్‌నూ ఊచకోత కోసి 287 పరుగులు చేసింది. ముంబై జట్టులో బుమ్రా , బెంగళూరు జట్టులో సిరాజ్‌లాంటి టీమిండియా స్టార్ పేసర్లు ఉన్నా హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం కొనసాగింది. మరోసారి హైదరాబాద్ టాపార్డర్... సునామీ సృష్టిస్తే అందులో 300 పరుగుల మార్క్‌ను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.
ఆకాశ్ కామెంట్స్
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇవాళ జరగనున్న మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఇవాళ్టీ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే 300 పరుగుల రికార్డు బద్దలు కావచ్చన్నాడు. ఢిల్లీ మైదానం చాలా చిన్నది కాబట్టి ఇవాళ్టీ మ్యాచ్‌లోనే 300 పరుగుల మార్క్‌ను హైదరాబాద్ బద్దలు కొట్టవచ్చన్నాడు. ఢిల్లీ మైదానం కూడా భారీ షాట్లు ఆడటానికి వీలుగా ఉంటుందని.. ఈ మ్యాచ్‌లో చాలా ఉత్కంఠభరితమైన పోటీని చూడవచ్చని. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ మంచి జోరుతో బరిలోకి దిగడమే ఇందుకు కారణమని ఆకాశ్ చోప్రా తెలిపాడు.
కమిన్స్ సారథ్యంలో
ఆస్ట్రేలియాకు వన్డే ప్రపంచకప్ అందించిన ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా రావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారిపోయింది. ఇప్పటివరకూ ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి.. రెండు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగోస్థానంలో ఉంది. కమిన్స్ హైదరాబాద్ జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. ట్రావిస్ హెడ్ రాకతో సన్‌రైజర్స్ ఓపెనింగ్ చాలా బలంగా మారింది. అభిషేక్ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు. క్లాసెన్, మార్క్రమ్, సమద్, నితీశ్ రెడ్డితో బ్యాటింగ్ బలంగా మారింది. ఈ బ్యాటింగ్ బలంతో ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొడుతోంది. నిలకబడగా ఆడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తోంది.