Dc Vs Srh 35th Match Ipl 2024 Delhi Capitals target 267: ఐపీఎల్‌(IPL)లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) బ్యాటర్లు మరోసారి విధ్వంసం సృష్టించారు. ట్రానిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ విధ్వంసంతో సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డు ఆరంభంలో బుల్లెట్‌ ట్రైన్‌లా దూసుకుపోయింది. చివర్లో నితీశ్‌కుమార్‌ రెడ్డి, హెహబాజ్‌  అహ్మద్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి266 పరుగులు చేసింది. ఆరంభంలో సన్‌రైజర్స్‌ దూకుడు చూస్తే 300 పరుగులను మైలురాయిని చాలా తేలిగ్గా చేరుకుంటుందని అనిపించింది. కానీ కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌... హైదరాబాద్‌ బ్యాటర్లకు కళ్లెం వేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రానిస్‌ హెడ్‌ 32 బంతుల్లో 89, అభిషేక్‌ శర్మ 12 బంతుల్లో 46 పరుగులతో తుపాను ఇన్నింగ్స్‌ ఆడారు. నితీశ్‌కుమార్‌రెడ్డి 27 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి అక్షర్‌ పటేల్‌... హైదరాబాద్‌ స్కోరు బోర్డుకు కళ్లెం వేశాడు.


ఏమిటీ ఈ ఊచకోత
 పవర్‌ ప్లేలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్కోరు 125 పరుగులు. అంటే 36 బంతుల్లో హైదరాబాద్‌ 125 పరుగులు చేసింది. ట్రానిస్‌ హెడ్‌ ఊచకోత కోశాడు. ప్రత్యర్థి బౌలర్లు బంతులు వేసేందుకే భయపడేలా ట్రానిస్‌ హెడ్‌ చెలరేగిపోయాడు. గత మ్యాచ్‌లో బెంగళూరుకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన హెడ్‌... ఇప్పుడు ఢిల్లీ బౌలర్లకు అంతకుమించిన నరకం చూపించాడు. శతకం చేయకపోయినా ట్రానిస్‌ హెడ్‌ సృష్టించిన సునామీలో ఢిల్లీ బౌలర్లు కాసేపు విలవిలలాడారు.


కేవలం 32 బంతులు ఎదుర్కొన్న ట్రానిస్‌ హెడ్‌... 11 ఫోర్లు, 6 సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. శతకం దిశగా సాగుతున్న హెడ్‌ను కుల్‌దీప్‌ యాదవ్‌ అవుట్‌ చేశాడు.  ముకేశ్‌ కుమార్‌ వేసిన ఆరో ఓవర్‌లో ట్రానిస్‌ హెడ్‌ విశ్వరూపం చూపాడు. ఆ ఓవర్‌లో 22 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్‌లో ట్రావిస్ హెడ్ వరుసగా... 4, 4, 4, 4, 0, 6 బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి హైదరాబాద్ 125 పరుగులకు చేరింది. నోకియా వేసిన మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్ బాది 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్‌... సిక్సర్లు కొట్టడం ఇంత తేలిక అనేలా చేశాడు. ఐపీఎల్‌లో ఆరు ఓవర్లకు 105 పరుగుల రికార్డు హైదరాబాద్‌ బ్యాటర్ల విధ్వంసంతో కాలగర్భంలో కలిసిపోయింది.


ట్రానిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ విధ్వంసానికి మాటలే సరిపోలేదు. తొలి ఆరు ఓవర్లలో హైదరాబాద్‌ ఓపెనర్లు 11 సిక్సర్లు.. 13 ఫోర్లు కొట్టారంటే వారి బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరికీ బౌలింగ్‌ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు భయపడిపోయారు. పవర్‌ ప్లేలో హైదరాబాద్‌ చేసిన 125 పరుగుల్లో 108 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆ తర్వాత అక్షర్‌ పటేల్ ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, మార్క్రమ్‌ను అవుట్ చేసి పరుగులను కట్టడి చేశాడు. చివర్లో  నితీశ్‌కుమార్‌రెడ్డి 27 బంతుల్లో 37 పరుగులు చేసి అవుటయ్యాడు. షెహబాజ్‌ అహ్మద్‌ కూడా రాణించడంతో హైదరాబాద్‌ నిర్ణీత నిర్ణీత 20 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి266 పరుగులు చేసింది.