CSK vs RCB tickets sold out instantly : క్రికెట్‌ ప్రపంచం అంతా ఐపీఎల్‌(IPL) కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తుందో ఐపీఎల్‌ టికెట్ల విక్రయమే చాటిచెప్పింది. ఐపీఎల్‌ టిక్కెట్లు హాట్‌ కేకుల్లా  అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో విండో ఓపెన్‌ కాగానే క్షణాల్లో అయిపోయాయి.  ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(CSK vs RCB) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం సోమవారం ఉదయం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించారు. ఈ ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయ విండో ఓపెన్‌ చేయగానే క్షణాల్లో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక వ్యక్తికి రెండు టిక్కెట్లు మాత్రమే విక్రయించారు. అయినా విక్రయం ప్రారంభమైన వెంటనే టికెట్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రూ.7500, రూ.4500, రూ.4000, రూ.1700 టికెట్లన్నీ క్షణాల్లోనే అయిపోయాయి. 


కోహ్లీ మొదలెట్టేశాడు
టీ 20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచ‌క‌ప్(T20 World Cup) సెమీ ఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు ఓడిపోయిన తర్వాత.. విరాట్‌ టీమ్ఇండియా త‌రుపున ఒక్క టీ20 మ్యాచ్ లోనూ కోహ్లీ రాణించలేదు. దీంతో పొట్టి క్రికెట్‌కు విరాట్‌ వీడ్కోలు పలికినట్లేనని.. అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కసరత్తులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే విరాట్‌ పొట్టి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకునేందుకు ఓ అవకాశం ఉంది అదే ఐపీఎల్‌. బెంగళూరు తరపున బరిలోకి దిగుతున్న కోహ్లీ మరోసారి విశ్వరూపం చేస్తే పొట్టి ప్రపంచకప్‌లో విరాట్‌ స్థానం పదిలమే. వఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్ బెంగళూరు... చెన్నై సూపర్‌కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ నుంచి తన ఐపీఎల్‌ సీజన్‌ ప్రయాణాన్ని ప్రారంభించనున్న కోహ్లీ... ఫామ్‌లోకి వస్తే టీ 20 ప్రపంచకప్‌లో స్థానం ఖాయమే. ఒక్కసారి టచ్‌లోకి వస్తే కోహ్లీని ఆపడం ఎవరి తరమూ కాదు. ఐపీఎల్‌లో మరో ఆరు పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్‌లో 12,000 రన్స్‌ చేసిన ఆరో ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. ఇంతటి ఘన రికార్డులు ఉన్న కోహ్లీ.. అంత తేలిగ్గా అవకాశాన్ని వదులుకుంటాడా. వదలడు విధ్వంసం సృష్టిస్తాడు. 



ధోనీతోనే తొలి యుద్ధం
తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌(Mohammad Kaif)... కోహ్లీ( Virat Kohli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని అన్నాడు. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదని... కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారని కోహ్లీ తీరు దానికి భిన్నమని కైఫ్‌ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీ మరింత ప్రమాదకరంగా ఆడతాడని ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే విరాట్ కీలకమని కైఫ్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది.