Mumbai Indians :ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మను తీసేసి, హార్దిక్ ను నియమించి రెండు నెలలైపోతోంది. మెల్లగా ఎలాగోలా ఈ ఫ్యాక్ట్ కు అడ్జస్ట్ అవుదామని ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నా, హార్దిక్ మాత్రం తన ఆఫ్ ఫీల్డ్ బిహేవియర్‌తో అస్సలు ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. మరో మూడు రోజుల్లో ఈ ఏడాది ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది. ఈ పరిస్థితుల్లో ముంబయి జట్టులో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని మరోసారి స్పష్టంగా బయటపడింది.


బౌచర్‌ సైలెంట్‌


సీజన్ ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడం ఆనవాయితీ కాబట్టి... కెప్టెన్ హార్దిక్ పాండ్య, కోచ్ మార్క్ బౌచర్‌తో ముంబయి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఇక్కడే వారిద్దరూ కలిసి పెంటపెంట చేశారు. కోచ్ మార్క్ బౌచర్‌ను ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న అడిగాడు. ఇకపై ముంబయి కెప్టెన్ గా రోహిత్ ఉండకూడదని, అదే సమయంలో హార్దిక్ ఎందుకు ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ కు అనిపించిందో చెప్పగలరా అని అడిగాడు. బౌచర్ వద్ద నుంచి నో ఆన్సర్. వెంటనే పక్కకు తిరిగాడు. తమ జట్టు మీడియా మేనేజర్ వైపు. ఈ క్వశ్చన్ అవాయిడ్ చేయాలి అన్నట్టుగా.



హార్దిక్‌ నుంచి నో ఆన్సర్


ఆ తర్వాత అదే రిపోర్టర్ నుంచి హార్దిక్ పాండ్యకు ప్రశ్నలు వచ్చాయి. ముంబయికి తిరిగి వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తూనే.... మీరు ముంబయికి రావాలంటే కెప్టెన్సీ కచ్చితంగా కావాలనే క్లాజ్ కాంట్రాక్ట్ లో ఉందంట కదా అని అడిగాడు. హార్దిక్ నవ్వి ఊరుకున్నాడు. తమ మీడియా మేనేజర్ వైపు తిరిగాడు. అంటే మళ్లీ క్వశ్చన్ స్కిప్. హార్దిక్ కు ఇంకో ప్రశ్న. గుజరాత్ నుంచి వచ్చేసేముందు... గిల్ తో ఏమైనా మాట్లాడారా.. జట్టు అప్పగింతల గురించి, ఇతర విషయాల గురించి అని అడిగారు. హార్దిక్ నుంచి సేమ్ రియాక్షన్.



సోషల్ మీడియాలో ట్రోల్స్


ఇలా కెప్టెన్ అండ్ కోచ్ ఈ ప్రశ్నలు స్కిప్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాటికి సమాధానాలు కష్టమే అని అందరికీ తెలుసని, డ్రెస్సింగ్ రూం లోపల ఎలాంటి విషయాలు జరిగినా పర్లేదని, కానీ ప్రపంచమంతా చూసే ప్రెస్ మీట్లలో ఇలాంటి క్వశ్చన్స్ కు కాస్త కవర్ చేస్తున్నట్టుగా, మర్యాదపూర్వకంగా జవాబిస్తే సరిపోయేదని, ఇలా అవాయిడ్ చేయడం వల్ల గొడవలు ఉన్నాయని కచ్చితంగా చెప్తున్నట్టే అని ఫ్యాన్స్ అంతా హార్దిక్ తీరుపై మండిపడుతున్నారు.



మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్ 


ఇలాంటి వ్యక్తికా కెప్టెన్సీ ఇచ్చిందని చాలా మంది ముంబయి ఇండియన్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే ప్రెస్ మీట్ లో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ...కెప్టెన్ అయ్యాక ఇంకా రోహిత్ తో మాట్లాడలేదని, ముంబయి క్యాంప్ నకు రాగానే మాట్లాడతానని, ఎన్నో ఏళ్లుగా రోహిత్ కెప్టెన్సీలో ఆడానని, సీజన్ అంతా రోహిత్ తన భుజంపై చేయి వేసి ప్రోత్సహిస్తాడన్నన నమ్మకం ఉందని హార్దిక్ చెప్పుకొచ్చాడు.



మొత్తానికి హార్దిక పాండ్యా ప్రెస్‌ మీట్‌తో ఇప్పుడు అందరి ఫోకస్ ముంబయి జట్టుపై పడింది. డ్రెస్సింగ్ రూమ్‌లోని విభేదాలు ఓకే కానీ... గ్రౌండ్‌లో వీటి ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ అప్పుడే మొదలైపోయింది.