MS Dhoni hands over captaincy to Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ వారసుడు ఎవరో సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ పేరును ప్రకటించారు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలను గైక్వాడ్ కు అప్పగించాడని సీఎస్కే ఫ్రాంచైజీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ట్రోఫీ లాంచింగ్ ఈవెంట్ లో సైతం కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ కనిపించాడు.




ధోనీ కొత్త రోల్ కు క్లారిటీ వచ్చినట్లేనా? 
ఐపీఎల్ 2024లో తాను కొత్త రోల్ లో కనిపించనున్నానని ఎంఎస్ ధోనీ కొన్ని రోజుల కిందటే హింట్ ఇచ్చాడు. అయితే ధోనీ ఏం చేయబోతున్నాడు, ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తాడా అని ఐపీఎల్ ఆరంభం వరకు ఎదురుచూస్తున్న ధోనీ అభిమానులు, సీఎస్కే ఫ్యాన్స్, క్రికెట్ ప్రేమికులకు ఆ విషయం తెలిసింది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. దాంతో తన వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పగించారు. సీఎస్కే కెప్టెన్ గైక్వాడ్ అని ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. దాంతో ఈ సీజన్‌లో సీనియర్ ఆటగాడిగా, రుతురాజ్ కు పెద్దన్నగా ధోనీ కొత్త రోల్ ఇదేనా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. కొత్త కెప్టెన్ గా రుతురాజ్ ను స్వాగతిస్తూ కామెంట్లు చేస్తున్నారు.


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్  మార్చి 22న ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్ 17 ప్రారంభానికి ముందే ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని లీగ్ నిర్వాహకులు అధికారికంగా నిర్వహిస్తారు. గురువారం (మార్చి 21న) ఐపీఎల్ తాజా సీజన్ ట్రోఫీ ఆవిష్కరణకు 9 జట్ల కెప్టెన్లు హాజరుకాగా, పంజాబ్ కింగ్స్ నుంచి వైస్ కెప్టెన్ జితేష్ శర్మ పాల్గొన్నాడు. అయితే అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీకి బదులుగా రుతురాజ్ గైక్వాడ్ హాజరు కావడంతో ఆ ఫొటో చూసిన అభిమానులు షాకయ్యారు. ధోనీకి బదులుగా రుతురాజ్ వచ్చాడని చర్చ మొదలవుతుండగానే సీఎస్కే ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది. ఐపీఎల్ ఎక్స్ పేజీలో సైతం ట్రోఫీ ఆవిష్కరణ ఈవెంట్ కు కెప్టెన్లు హాజరయ్యారని పేర్కొంది. అయితే సీఎస్కే మేనేజ్ మెంట్ అధికారిక ప్రకటనతో చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ అని.. తాజా సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ అతడి సారథ్యంలో ఆడనున్నారని కన్ఫామ్ అయింది.