Mumbai Indians playoff Chances: ఐపీఎల్(IPL) చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు టైటిల్ కైవసం చేసుకున్న ముంబై(MI) జట్టు ఈ సీజన్‌లో ఓటములతో  సతమతమవుతుంది. నూతన సారధి హార్దిక్‌  పాండ్య నేతృత్వంలో పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ప్రస్తత సీజన్​లో తొమ్మిది మ్యాచ్​లు ఆడిన ముంబయి ఏకంగా ఆరింట్లో ఓడి, కేవలం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. తాజాగా ఢిల్లీ చేతిలో ఓటమితో ప్లేఆఫ్స్​ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. . దీంతో ముంబయి ప్లేఆఫ్స్​కు చేరే అవకాశాలపై ఫ్యాన్స్ సైతం  ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ  ముంబై ప్లే ఆఫ్ ని చేరాలంటే ఏం జరగాలి. 


ముంబై ప్లే ఆఫ్‌కు చేరాలంటే.. 


లీగ్‌ దశలో  ముంబై ఇండియన్స్ ఇంకా 5 మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్​తో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉండగా , లక్నో తో  రెండు మ్యాచ్​లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతానికి పాయింట్స్ టేబల్ ను పరిశీలిస్తే 9 మ్యాచ్ లు ఆడిన  రాజస్థాన్‌ 8 విజయాలతో పాయింట్స్ పట్టికలో మొదటి స్థానంలో ఉంది. 8 మ్యాచ్ లు ఆడిన  కోల్‌కతా 5 విజయాలతో 2 వ స్థానంలోనూ , 9గేమ్స్ ఆడిన లఖ్​నవూ 5 విజయాలతో , 8 గేమ్స్ 5 విజయాలతో  హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ -4లో ఉన్నాయి.  ఈ రకంగా చూస్తే  టాప్‌- 4లో ఉన్న మూడు జట్లతోనే ముంబై తన తరువాతి 5  మ్యాచ్​లు ఆడనుంది.  ఆ   మ్యాచ్​లన్నీ  గెలిచినప్పుడు మాత్రమే ముంబయి ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఐదు  మ్యాచుల్లో  ఒక్క మ్యాచ్‌ ఓడిపోయినా ముంబై  తన ప్లే ఆఫ్ కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.


ఒకవేళ ముంబై ఇండియన్స్  ఒక మ్యాచులో ఓడిపోతే, మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ వ్యత్యాసంతో గెలవాల్సి ఉంటుంది.  ఇక మ్యాచ్ ల విషయానికి వస్తే ఆడనున్న  5 మ్యాచ్‌ల్లో ముంబై  తమ సొంత మైదానం వాంఖడే స్టేడియంలోనే మూడు మ్యాచులు ఆడనుంది. ఇది ఒక్కటే ఆ టీం కి  కలిసొచ్చే అంశం.   వాంఖడే స్టేడియంలో పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.  కానీ విధ్వంసకర బ్యాటర్లు ఉన్న కోల్‌కతా,  సన్‌రైజర్స్‌, లక్నో  బ్యాటర్లను ముంబయి బౌలర్లు కట్టడి  చేయగలుగుతారా లేదా అన్నది ప్రశ్నార్ధకమే. 


మిగిలిన 2 మ్యాచ్ లలో ఒకటి  లక్నో లోని ఎకానా స్టేడియం, రెండవది కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ముంబై  ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్  పిచ్  బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. కానీ లఖ్​నవూ ఎకానా వాజ్‌పేయీ స్టేడియం మాత్రం స్లో పిచ్.  అసలు పిచ్ ఏదైనా ముంబై ఇండియన్స్ గట్టిగా ఆడకపోయినా, ఒక్క మ్యాచ్ లో ఒడిపోయినా ప్లే ఆఫ్ కోసం ఢిల్లీ  క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ ఫలితాలపై   ఆధారపడాల్సి ఉంటుంది.  ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచుల్లో అయిదు  విజయాలను సాధించి పాయింట్స్ టేబుల్ లో అయిదో స్థానంలో ఉండగా. చెన్నై ఎనిమిది మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఆరో స్థానంలో ఉంది.