GT vs RCB  IPL 2024 Royal Challengers Bengaluru opt to bowl:  ఐపీఎల్(IPL) 2024లో 45వ మ్యాచ్‌ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB),  గుజరాత్ టైటాన్స్‌(GT)ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.   ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉండాలన్నా పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవాలన్న తప్పక గెలుపు అవసరమైన వేళ రాయల్‌ ఛాలెంజర్స్‌  బెంగళూరుకి ఈ గెలుపు అవసరం. బలహీనంగా ఉన్న గుజరాత్‌ బౌలింగ్‌ దళం... బలంగా కనిపిస్తున్న బెంగళూరు బ్యాటర్లకు మధ్య పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం స్పిన్ బౌలింగ్‌కు సహకరిస్తుంది. ఇక్కడ వన్డేల్లో సగటు స్కోరు ఓవర్‌కు 5 పరుగుల కంటే తక్కువ. ముఖ్యంగా IPLలో ఇక్కడ ఛేదన చేసే జట్టుకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బెంగళూరు ఛేదన చేసేందుకే మొగ్గు చూపింది. 


 ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడి ఓడిన గుజరాత్‌.. ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. నిజానికి గుజరాత్‌, బెంగళూరు జట్లను బలహీనమైన బౌలింగ్‌ వేధిస్తోంది. గుజరాత్‌ ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు అయిదు పరాజయాలతో  పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లకు కూడా ఎనిమిది పాయింట్లే ఉన్నా నెట్‌ రన్‌రెట్‌తో గుజరాత్‌కంటే పైన ఉన్నాయి. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని శుభ్‌మన్‌ గిల్‌ సేన భావిస్తోంది.


ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు బౌలర్లు విఫలమైనా బ్యాటర్లు రాణించారు. గత మ్యాచ్‌లో రజత్ పాటిదార్, కామెరూన్ గ్రీన్‌లు ఫామ్‌ను అందుకుని పరుగులు  పెట్టారు. రజత్‌ పాటిదార్ చివరి రెండు మ్యాచ్‌ల్లో  గట్టి బౌలర్లను ఎదుర్కొని అర్ధశతకాలు చేశాడు. అందుకే గుజరాత్‌ స్పిన్నర్‌లపై కూడా పాటిదార్‌ రాణిస్తాడని బెంగళూరు భావిస్తోంది.   గ్రీన్ కూడా టచ్‌లోకి వచ్చాడు. విరాట్ కోహ్లి, డు ప్లెసిస్‌లు భారీ స్కోర్లపై కన్నేయగా.. దినేష్ కార్తీక్, లామ్రోర్‌ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు.  మ్యాక్స్‌వెల్ మళ్లీ తుది జట్టులోకి వచ్చాడు. వీరు మరోసారి రాణిస్తే బెంగళూరు విజయం సాధించడం కష్టమేమీ కాదు.


రికార్డ్స్‌ పరిశీలిస్తే .. 


గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 3 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ 3 మ్యాచ్‌లలో గుజరాత్ 2 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు ఒక మ్యాచ్‌లో గెలిచింది.


బెంగళూరు తుది జట్టు  ..


విరాట్ కోహ్లీ, ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తిక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్‌ శర్మ, సిరాజ్, యశ్ దయాల్


గుజరాత్‌ తుది జట్టు..


శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్‌, రాహుల్ తెవాతియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ