GT vs RCB IPL 2024 Royal Challengers Bengaluru target 201 : రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ (GT)పోరాడే స్కోరు సాధించింది. షారూఖ్‌ ఖాన్‌, సాయి సుదర్శన్‌ అర్ధ శతకాలతో మెరవడంతో గుజరాత్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి సరిగ్గా 200 పరుగులు చేసింది. గత కొన్ని మ్యాచుల నుంచి వరుసగా విఫలమవుతున్న బెంగళూరు బౌలర్లు ఈ మ్యాచ్‌లో రాణించారు. కట్టుదిట్టమైన బంతులతో గుజరాత్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. కానీ సాయి సుదర్శన్‌, షారూఖ్‌ ఖాన్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఉన్నంతసేపు ధాటిగా ఆడి గుజరాత్‌కు పోరాడే స్కోరును అందించారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌ ఒకటి, మహ్మద్‌ సిరాజ్‌ ఒకటి, మ్యాక్స్‌వెల్‌ ఒక వికెట్‌ తీశారు.

 

సుదర్శన్‌ మెరుపు బ్యాటింగ్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ వృద్ధిమాన్‌ సాహా 5 పరుగులకే ఔటయ్యాడు. స్వప్నిల్ బౌలింగ్‌లో కర్ణ్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి సాహా పెవిలియన్‌కు చేరాడు. దీంతో 6 పరుగుల వద్ద గుజరాత్‌ మొదటి వికెట్‌ను కోల్పోయింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్‌కు పరుగులు రావడం కష్టమైపోయింది. గత మ్యాచుల్లో తేలిపోయిన బెంగళూరు బౌలింగ్‌ ఆరంభంలో కాస్త గాడినపడ్డారు. యశ్ దయాల్ వేసిన 4వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. పవర్‌ ప్లేలో గుజరాత్ ఒక వికెట్‌ నష్టానికి కేవలం 42 పరుగులే చేసింది. 45 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్ కోల్పోయింది. మ్యాక్స్‌వెల్ ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్‌కు క్యాచ్‌ ఇచ్చి 16 పరుగులు చేసి శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ స్కోరు 82/2.

కామెరూన్ గ్రీన్ వేసిన 11 ఓవర్‌లో షారుక్ ఖాన్ సిక్స్ బాదాడు. షారుక్ ఖాన్‌ ఉన్నంతవరకూ ధాటిగా ఆడాడు. 24 బంతుల్లోనే షారుక్ ఖాన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 13 ఓవర్‌లో వరుసగా 4, 4, 6 బాదేసి 24 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. షారుక్‌కు ఐపీఎల్‌లో ఇది తొలి హాఫ్‌ సెంచరీ. 30 బంతుల్లో మూడు ఫోర్లు, అయిదు సిక్సర్లతో 58 పరుగులు చేసి షారూఖ్‌ఖాన్‌ అవుటయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో షారూక్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు సాయి సుదర్శన్‌ మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 34 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.  సాయి సుదర్శన్‌ 49 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి సరిగ్గా 200 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్‌ సింగ్‌ ఒకటి, మహ్మద్‌ సిరాజ్‌ ఒకటి, మ్యాక్స్‌వెల్‌ ఒక వికెట్‌ తీశారు.