ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో మొత్తం 72 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ అత్యంత ఖరీదైనదిగా నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లకు స్టార్క్‌ను కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్ రెండో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. 20.50 కోట్లకు కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. వేలంలో అత్యంత ఖరీదైన భారత ఆటగాడిగా హర్షల్ పటేల్ నిలిచాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. యూపీ తరఫున ఆడిన సమీర్ రిజ్వీ అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్. సమీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 8.40 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్ వేలం జరుగుతున్న సమయంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు స్క్రీన్ షాట్లను షేర్ చేశాడు. 

 

ఐపీఎల్ 2024 వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన తన సహచరులు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్‌లను అభినందించేందుకు వార్నర్ విఫలమయ్యాడు. దీనికి కారణం ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వేదికల్లో వార్నర్‌ను సన్‌రైజర్స్‌ బ్లాక్‌ చేయడమేనని వార్నర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని వార్నర్ ఇన్‌స్టా స్టోరీ రూపంలో తన బాధను వ్యక్తం చేశాడు. ట్రావిస్ హెడ్ పోస్టును రీపోస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నానని... కానీ సన్‌రైజర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను బ్లాక్ చేసిందని వార్నర్ ఆవేదనను వ్యక్తం చేశాడు. 

 

ఐపీఎల్‌లో 2016 సీజన్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను డేవిడ్‌ వార్నర్‌ విజేతగా నిలబెట్టాడు. ఆ జట్టు తరఫున విజయవంతమైన కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. సన్‌రైజర్స్‌ కప్‌ అందించిన వార్నర్‌ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు.  వార్నర్‌ను అన్‌బ్లాక్ చేయమని ఎస్ఆర్‌హెచ్‌కు సూచిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. తమ ఫ్రాంచైజీకి ట్రోఫీని అందించిన దిగ్గజ క్రికెటర్‌ను ఇలా అవమానించడం సరైంది కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఘటన తర్వాతైనా సన్‌రైజర్స్ వార్నర్‌ను అన్‌బ్లాక్ చేస్తుందో లేదో చూడాలి.  2015లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా నియమితుడైన వార్నర్‌.. తర్వాతి ఏడాదిలోనే ఆ జట్టుకు టైటిల్‌ అందించాడు. బ్యాటర్‌గా 848 పరుగులు చేసి టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

 

ఐపీఎల్ 2024 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు కనబర్చింది. వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను రూ.20.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పోటీ పడిన ఆరెంజ్ ఆర్మీ చివరకు కమిన్స్‌ను సొంతం చేసుకుంది. ముందుగా ట్రావిస్ హెడ్‌ను రూ.6.8 కోట్లకు కొనుగోలు చేసిన సన్‌రైజర్స్.. శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగను రూ.1.5 కోట్ల ప్రాథమిక ధరకు దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎవరెవరినీ కొనిందంటే: ప్యాట్‌ కమిన్స్ ‍(రూ. 20.5 కోట్లు), ట్రావిస్ హెడ్ ( రూ. 6.8 కోట్లు). జయ్‌దేవ్‌ ఉనద్కత్‌‍‍( రూ. 1.6 కోట్లు), వనిందు హసరంగ (రూ. 1.5 కోట్లు) ఆకాశ్‌ సింగ్‌ ( రూ. 20 లక్షలు) సుబ్రమణ్యన్( రూ. 20 లక్షలు)