Washington Sundar, IPL 2023: 


సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఊహించని షాక్‌ తగిలింది! అత్యంత కీలకమైన వాషింగ్టన్‌ సుందర్ గాయపడ్డాడు. ఐపీఎల్‌ 2023 సీజన్‌ మొత్తానికి దూరమవుతున్నాడు. హ్యామ్‌స్ట్రింగ్‌ ఇంజూరీయే ఇందుకు కారణం. ఆరెంజ్‌ ఆర్మీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. జట్టు సభ్యులు అతడికి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. 






ఈ సీజన్లో వాషింగ్టన్‌ సుందర్‌ ఏడు మ్యాచులు ఆడాడు. ఐదు ఇన్నింగ్సుల్లో 60 పరుగులు చేసి మొత్తంగా 3 వికెట్లు పడగొట్టాడు. చివరి మూడు సీజన్ల నుంచి సుందర్‌ గాయాలతో సతమతం అవుతున్నాడు. చేతి వేలికి గాయమవ్వడంతో 2021 సీజన్లో యూఏఈ లెగ్‌ మొత్తానికీ దూరమయ్యాడు. అయితే తొలి దశలో ఆర్సీబీ తరఫున 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతా కథేమీ మారలేదు. కొవిడ్‌ రావడంతో 2022, జనవరిలో టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటన మిస్సయ్యాడు. హ్యామ్‌స్ట్రింగ్‌ గాయంతో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీసూ ఆడలేదు. 


ఐపీఎల్‌ 2022 వేలంలో వాషింగ్టన్‌ సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్‌ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.10 కోట్ల వరకు వెచ్చించింది. అయితే బౌలింగ్‌ చేసే చేతిలో చీలిక రావడంతో నాలుగు మ్యాచులు ఆడలేదు. గతేడాది ఆగస్టులో కౌంటీ క్రికెట్లో లాంకాషైర్‌కు ఆడాడు. అప్పుడు ఫీల్డింగ్‌ చేస్తుండా డైవ్‌ చేయడంతో భుజానికి గాయమైంది. దాంతో జింబాబ్వేపై 3 వన్డేల సిరీసుకు దూరమయ్యాడు. ఈ గాయాల బెడద నుంచి అతనెప్పటికి బయట పడతాడో ఏమో!


ఇక తాజా సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. ఆటగాళ్లు బాగానే ఉన్నా సమతూకం కుదరడం లేదు. విజయాలు సాధించడం లేదు. సగం సీజన్‌ ముగిసే సరికి కేవలం 2 విజయాలే సాధించింది. 5 మ్యాచుల్లో ఓడింది. 4 పాయింట్లు, -0.961 రన్‌రేట్‌తో తొమ్మిదో స్థానంలో ఉంది. తొలి రెండు మ్యాచుల్లో రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతుల్లో ఓడింది. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై గెలిచింది. ఫామ్‌లోకి వచ్చినట్టేనని భావించే సరికే హ్యాట్రిక్‌ ఓటములు పలకరించాయి. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌తో ఓడింది.