IPL 2023 KKR vs RCB: 


మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఎమోషనల్‌ అయ్యాడు. ఐపీఎల్‌ ముగిశాకే కొత్తగా పుట్టిన తన కుమారుడు, భార్యను చూసేందుకు వెళ్తానని అన్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మ్యాచులో వచ్చిన పీవోటీఎం అవార్డును వారిద్దరికీ అంకితమిస్తున్నానని చెప్పాడు.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు వరుణ్‌ చక్రవర్తి కీలక స్పిన్నర్‌! ఒకట్రెండు మ్యాచుల్లోనూ పక్కకు తప్పించే అవకాశం లేదు. వికెట్లు పడగొట్టాలన్నా.. పరుగులు నియంత్రించాలన్నా అతడి బౌలింగ్‌ అత్యవసరం. అందుకే ప్రతి మ్యాచులోనూ ఆడిస్తున్నారు. ఇక బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచులో వరుణ్‌ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత హర్ష భోగ్లే అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చాడు.


'ఈ అవార్డును కొత్తగా పుట్టిన నా కుమారుడు, భార్యకు అంకితమిస్తున్నా. వారిని ఇంకా చూడలేదు' అని వరుణ్‌ చక్రవర్తి అన్నాడు. దాంతో ఇంటర్వ్యూ చేస్తున్న హర్ష భోగ్లే..  వరుణ్‌ చక్రవర్తి ఇంటికెళ్లి భార్యాబిడ్డల్ని చూసేందుకు అనుమతించాలని కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌కు విజ్ఞప్తి చేశాడు. 


'చివరి మ్యాచులో నేను 49 రన్స్‌ ఇచ్చాను. ఈ మ్యాచులో బాగా ఆడాను. క్రికెట్‌ ఇలాగే ఉంటుంది. ఈ ఏడాది వేరియన్స్‌ కన్నా కచ్చితత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను. మరిన్ని వేరియేషన్స్‌ జత చేసుకోవాలని అనుకోవడం లేదు. నా బౌలింగ్‌పై ఎంతో శ్రమిస్తున్నాను. ఏసీ పార్థిపన్‌కే ఈ ఘనత చెందుతుంది. అతడు నాకోసం ఎంతో కృషి చేస్తున్నాడు. అభిషేక్‌ నాయర్‌ కూడా! అందుకే వారిద్దరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. సంక్లిష్టమైన సమయంలో బౌలింగ్‌ చేయడాన్ని సవాల్‌గా తీసుకుంటాను. నితీశ్‌ అవసరమైన ప్రతిసారీ నా చేతికి బంతినిస్తున్నాడు. ఇది నాకెంతో నచ్చుతోంది' అని వరుణ్‌ చక్రవర్తి అన్నాడు.


IPL 2023, RCB vs KKR: 


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుస విజయాలకు తెరపడింది! చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ సేన 21 రన్స్‌ తేడాతో ఓటమి చవిచూసింది. కోల్‌కతా చేతిలో రెండోసారీ భంగపడింది. 201 రన్‌ ఛేజ్‌లో ఆర్సీబీ 179/8కి పరిమితమైంది. విరాట్‌ కోహ్లీ (54; 37 బంతుల్లో 6x4) ఒక్కడే పోరాడాడు. మహిపాల్‌ లోమ్రర్‌ (34; 18 బంతుల్లో 1x4, 3x6) అతడికి తోడుగా నిలిచాడు. అంతకు ముందు కేకేఆర్‌లో ఓపెనర్‌ జేసన్ రాయ్‌ (56; 29 బంతుల్లో 4x4, 5x6) డిస్ట్రక్టివ్‌ ఓపెనింగ్‌ ఇచ్చాడు. వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (48; 21 బంతుల్లో 3x4, 4x6), వెంకటేశ్‌ అయ్యర్‌ (31; 26 బంతుల్లో 3x4) చక్కని ఇన్నింగ్సులతో మెరిశారు.