SuryaKumar Yadav, IPL 2023:
ఐపీఎల్ 2023లో ముంబయి ఇండియన్స్‌కు షాక్! ఆ జట్టు కీలక బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) గాయపడ్డాడు. అక్షర్ పటేల్ ఇచ్చిన క్యాచ్ అందుకొనే క్రమంలో కంటికి దెబ్బ తగిలించుకున్నాడు. దీంతో తర్వాతి మ్యాచుల్లో అతడు ఆడటంపై సందేహం నెలకొంది.
అరుణ్ జైట్లీ మైదానం వేదికగా మంగళవారం దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడ్డాయి. వార్నర్ సేన మొదట బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జేసన్ బెరెన్‌డార్ఫ్ వేసిన బంతిని అక్షర్ పటేల్ గాల్లోకి లేపాడు. దానిని అందుకొనేందుకు సూర్య పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఫ్లడ్‌లైట్ల ప్రభావమో మరేదో అంతరాయమో అతడి అంచనా తప్పింది. చేతుల్లోంచి జారిపోయిన బంతి నేరుగా కంటికి తాకింది.
ఆ నొప్పి భరించలేక సూర్యకుమార్ యాదవ్ మైదానంలోనే విల్లవిల్లాడు. కాసేపు ఫీల్డింగ్ చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి చెక్ చేశాడు. ఛేదనలో బ్యాటింగ్‌కు వస్తాడో లేదో సందిగ్ధం నెలకొంది. అయితే జట్టు స్కోరు 139 వద్ద తిలక్ వర్మ (41) ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చాడు. ఆడిన తొలి బంతికే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. కుల్‌దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చాడు. భారత్, ఆస్ట్రేలియా సిరీస్ నుంచి సూర్యా భాయ్ ఫామ్ కోల్పోయాడు. వరుసగా గోల్డెన్ డకౌట్లు అవుతున్నాడు.
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్‌కు ఎలా ఉందో ముంబయి ఇండియన్స్ ప్రాంఛైజీ అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. ఒకవేళ ఎలాంటి ఇబ్బందీ లేకపోతే ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆడతాడు. లేదంటే విశ్రాంతి తీసుకుంటాడు. కాగా రోహిత్ సేనకు ఈ సీజన్లో ఇదే మొదటి విజయం. ఆడిన తొలి రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. తొలుత ఆర్సీబీ, తర్వాత సీఎస్‌కే చేతిలో పరాజయం చవిచూసింది.
IPL 2023, DC vs MI: ఐపీఎల్ -16 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయాన్ని అందుకుంది. ముంబై సారథి రోహిత్ శర్మ (65: 45 బంతుల్లో, 6 బౌండరీలు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు ఆంధ్రా కుర్రాడు తిలక్ వర్మ (41: 29 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) , ఇషాన్ కిషన్ (31: 26 బంతుల్లో 6 ఫోర్లు) ల నిలకడైన ఆటతో పాటు చివర్లో కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ ల పోరాటంతో ఎంఐకి తొలి విజయం దక్కింది. ఐపీఎల్‌లో మునపటి రోహిత్ శర్మను గుర్తు చేస్తూ హిట్‌మ్యాన్ అరుణ్ జైట్లీ స్టేడియంలో బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. కానీ చివర్లో వరుసగా వికెట్లు కోల్పోయి ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్ లో ముంబై.. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. కాగా ఈ సీజన్‌లో ఢిల్లీకి వరుసగా నాలుగో పరాజయం. ఇక నుంచి ఆ జట్టుకు ప్లేఆఫ్స్ కష్టాలు మొదలైనట్టే..!