Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) ప్రయాణం రెండో క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఓటమితో ముగిసింది. ఈ సీజన్ సెకండాఫ్‌లో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. దీనికి ప్రధాన కారణం సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన బ్యాటింగ్. సూర్యకుమార్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా ఒక సీజన్‌లో 600కు పైగా పరుగులు చేయగలిగాడు.


ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఒక సీజన్‌లో 600కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సూర్యకుమార్ ఈ ఫీట్ సాధించాడు. ఈ సీజన్‌లో సూర్య 43.21 సగటుతో మొత్తం 605 పరుగులు చేశాడు.


ఈ సీజన్‌లో సూర్యకుమార్ ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. 2010 సీజన్‌లో సచిన్ మొత్తం 618 పరుగులు చేశాడు.


టీ20 కెరీర్‌లో 6500 పరుగులు
గుజరాత్‌పై 61 పరుగుల ఇన్నింగ్స్ సాయంతో సూర్యకుమార్ యాదవ్ తన ఠీ20 కెరీర్‌లో 6500 పరుగులు పూర్తి చేశాడు. సూర్యకుమార్ తన 258వ టీ20 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. ఇందులో అతని సగటు 35 కాగా స్ట్రైక్ రేట్ 151.


2021 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుండి, సూర్యకుమార్ యాదవ్ టీ20లో భారతదేశం కోసం గొప్ప ఆటను ప్రదర్శించాడు. ప్రస్తుతం టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యనే. భారత్ తరఫున 48 టీ20 మ్యాచ్‌లు ఆడి 46.53 సగటుతో మొత్తం 1,675 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 13 హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ఒక సంవత్సరంలో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌నే.


అయితే ఐపీఎల్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్ బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు. టీ20లలో  ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్.. బరిలోకి దిగితే సిక్సర్ల మోతతో ప్రత్యర్థులను హడలెత్తించే  టీమిండియా స్టార్  బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది. అతడు టీ20లకు తప్ప మిగిలిన ఫార్మాట్లకు పనికిరాడా..? వన్డేలు ఆడటం  సూర్యకు చేతకాదా..?  అని విమర్శలు వచ్చాయి.  టీ20లలో బంతి పడితే దానిని  360 డిగ్రీల కోణంలో ఆడే  సూర్య..  వన్డేలలో మాత్రం కనీసం క్రీజులో నిలుచోడానికే తంటాలు పడ్డాడు. అతడి ప్రదర్శనలతో విసిగిపోయిన  అభిమానులు.. అతడు ‘సూర్య’కుమార్ కాదు.. ‘శూణ్య’కుమార్ అని  ఆటాడుకున్నారు. 


ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా  సూర్యకుమార్.. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ‘సున్నాలు’ చుట్టాడు. అదేదో పది, పదిహేను బంతులాడి  బౌలర్లను అర్థం చేసుకునే క్రమంలో నిష్క్రమించింది కాదు.  రావడం పోవడమే. అదేదో సినిమాలో చెప్పినట్టు.. ‘అంతా కమ్ అండ్ గో లా అయిపోయింది’అనే మాదిరిగా అయిపోంది సూర్య బ్యాటింగ్.   


0, 0, 0, 14, 0, 31, 4, 6, 34, 4.. గడిచిన పది వన్డే ఇన్నింగ్స్ లలో   నయా మిస్టర్ 360  చేసిన స్కోర్లవి. అంటే  పది ఇన్నింగ్స్ లలో కలిపి వంద పరుగులు  కూడా చేయలేదు.   టీ20లలో నమ్మదగ్గ బ్యాటర్ గా ఉన్న  సూర్య.. వన్డేలలో మాత్రం  అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.