World Cup 2023 Venues BCCI: ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023 భారతదేశంలో జరగనుంది. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) త్వరలో సన్నాహాలు ప్రారంభించనుంది. తాజాగా ప్రపంచకప్ గురించి ఓ పెద్ద వార్త వచ్చింది. నివేదికల ప్రకారం ప్రపంచకప్‌కు సంబంధించిన మైదానాల జాబితాను బీసీసీఐ త్వరలో ప్రకటించనుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత ప్రపంచ కప్ వేదికను ప్రకటించవచ్చు. ఈ టోర్నమెంట్‌లో భారతదేశం, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌ను ప్రపంచం నలుమూలల నుండి అభిమానులు వీక్షిస్తారు.


ప్రపంచ కప్ 2023 షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలో వేదికపై అప్‌డేట్ రావచ్చు. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ తర్వాత బీసీసీఐ దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. దీని తర్వాత ప్రపంచకప్ వేదికల గురించి అప్‌డేట్ రావచ్చు. వేదికలో అహ్మదాబాద్‌కు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.


ప్రపంచ కప్ 2023 వేదికల గురించి మాట్లాడినట్లయితే చాలా పెద్ద నగరాలు దీని కోసం దృష్టి పెడతాయి. మీడియా కథనాల ప్రకారం బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం, చెన్నైలోని ఎంఏ. చిదంబరం స్టేడియం, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం, ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గౌహతిలోని అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలను ఈ జాబితా చేర్చవచ్చు. ఇందులో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం, ముంబైలోని వాంఖడే స్టేడియం కూడా ఉన్నాయి. వైజాగ్‌లోని స్టేడియం ఉంటుందో ఉండదో తెలియరాలేదు.


విశేషమేమిటంటే ప్రపంచ కప్ 2023 భారతదేశంలో జరగనుంది. దీనికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేక పెద్ద ప్రకటనలు చేసింది. ఆసియా కప్‌ ఆడేందుకు భారత్‌ పాకిస్థాన్‌కు రాకపోతే తాము కూడా భారత్‌కు రాలేమని పీసీబీ చీఫ్‌ చెప్పారు. ఈసారి ఆసియా కప్ పాకిస్థాన్‌లో జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రెండు టోర్నీల వేదికపై స్పష్టత లేదు. అయితే ప్రపంచకప్ కోసం పాకిస్థాన్ భారత్ వచ్చే అవకాశం ఉంది.


మరోవైపు ఐపీఎల్‌ 2023లో దేశవాళీ క్రికెటర్లు అదరగొడుతున్నారని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. భవిష్యత్తులో వారు భారత జట్టుకు కీలకం అవుతారని పేర్కొన్నాడు. సీనియర్లు గాయపడితే యశస్వీ జైశ్వాల్‌, రింకూ సింగ్‌, తిలక్‌ వర్మకు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అవకాశం దొరకొచ్చని అంచనా వేశాడు.


ఈ సీజన్లో దేశవాళీ క్రికెటర్లు అమేజింగ్‌ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నారు. వికెట్లూ తీస్తున్నారు. రాజస్థాన్‌ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ 13 మ్యాచుల్లో 575 పరుగులు చేశాడు. టోర్నీలో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. సెంచరీ సైతం కొట్టాడు. తెలుగబ్బాయి తిలక్‌ వర్మ ముంబయి ఇండియన్స్‌కు కీలకంగా మారాడు. మిడిలార్డర్లో దూకుడుగా ఆడుతూ విజయాలు అందించాడు.


ఇక రింకూ సింగ్‌ అయితే ఇరగదీశాడు. ప్రతి మ్యాచులోనూ కేకేఆర్‌ను ఆదుకున్నాడు. తిరుగులేని మ్యాచ్‌ ఫినిషర్‌గా అవతరించాడు. పంజాబ్‌ కింగ్స్‌లో జితేశ్‌ శర్మ, గుజరాత్‌లో సాయి సుదర్శన్ సైతం ఇంప్రెస్‌ చేశాడు. వీరందరిపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.