Mark Wood, IPL :


లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ మార్‌వుడ్‌ (Mark Wood) విధ్వంసకర ఫామ్‌లో ఉన్నాడు. 2022 నుంచి తిరుగులేని ప్రదర్శన చేస్తున్నాడు. బంతిని బుల్లెట్‌ వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లకు సంధిస్తున్నాడు. సగటున ప్రతి ఎనిమిదో బంతికి ఒక వికెట్‌ పడగొడుతున్నాడు. అతడు ఇదే ఫామ్‌ కంటిన్యూ చేస్తే రాహుల్‌ సేనకు తిరుగుండదు!


మార్క్‌వుడ్‌ ఇప్పటి వరకు కెరీర్లో 51 మ్యాచులు ఆడాడు. 177.3 ఓవర్లు విసిరాడు. 19.73 సగటు, 8.11 ఎకానమీతో 73 వికెట్లు పడగొట్టాడు. 1441 పరుగులు ఇచ్చాడు. మొత్తం కెరీర్లో 14.5 బంతులకు ఒక వికెట్‌ తీశాడు. అయితే 2022 నుంచి అతడు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. కేవలం 10 ఇన్నింగ్సుల్లో 36 ఓవర్లు విసిరి 27 వికెట్లు పడగొట్టాడు. 10.11 సగటు, 7.58 ఎకానమీ నమోదు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ ఎనిమిదిగా ఉంది. అంటే ప్రతి ఎనిమిది బంతులకు అతడో వికెట్‌ పడగొడుతున్నాడు. సగటున ఇన్నింగ్సుకు 3 వికెట్లైనా తీస్తున్నాడు.




ఐపీఎల్‌ (IPL 2023) తాజా సీజన్లో రెండు మ్యాచులు ఆడాడు. దిల్లీ క్యాపిటల్స్‌పై విశ్వరూపం ప్రదర్శించాడు. 4 ఓవర్లు వేసి 3.50 ఎకానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. ప్రతి 4.8 బంతులకు వికెట్‌ తీశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచులో 4 ఓవర్లు వేసి 49 రన్స్‌ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. 12.25 ఎకానమీ. అయితే ప్రతి 8 బంతులకో వికెట్‌ తీయడం ప్రత్యేకం.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో సిడ్నీలో శ్రీలంకపై 6 బంతులకో వికెట్‌ తీశాడు. 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. కరాచీ, లాహోర్‌లో పాకిస్థాన్‌తో రెండు మ్యాచుల్లో, పెర్త్‌, మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌పై ఎనిమిది బంతులకో వికెట్‌ చొప్పున పడగొట్టాడు. ఎకానమీ సైతం మరీ ఎక్కువగా ఏమీ లేదు. బంగ్లాదేశ్‌, అప్గానిస్థాన్‌, న్యూజిలాండ్‌పై 12 బంతులకు ఒక వికెట్‌ చొప్పున తీశాడు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మార్క్‌ వుడ్‌ ఎక్కువ మ్యాచులు ఆడలేదు. గతేడాది లక్నో సూపర్‌ జెయింట్స్‌ రూ.10 కోట్లతో అతడిని దక్కించుకుంది. అయితే ఒక మ్యాచ్‌ ఆడగానే గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అయినప్పటికీ అతడిని తన వద్దే అట్టిపెట్టుకుంది. ఈసారి మాత్రం మార్క్‌వుడ్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. తనదైన వేగంతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. అతడి బంతులను ఆడటం ప్రత్యర్థులకు కష్టంగా మారింది.