RCB vs LSG, IPL 2023:


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో మ్యాచులు ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్నాయి. మూడేళ్ల తర్వాత జట్లన్నీ హోమ్‌గ్రౌండ్‌లో అభిమానులను మురిపిస్తున్నాయి. ఒకప్పటితో పోలిస్తే పిచ్‌లు ఇప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి. వాటి స్వభావమేంటో అంత ఈజీగా అర్థమవ్వడం లేదు. సోమవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లక్నో సూపర్‌ జెయింట్స్ చిన్నస్వామి మైదానంలో తలపడుతున్నాయి. నేటి పిచ్‌ ఎలా ఉండబోతోంది? రెండు జట్లలో ఎవరిది ఆధిపత్యం?




పిచ్‌ రిపోర్ట్‌


చిన్నస్వామి.. అంటే అందరికీ గుర్తొచ్చేది హై స్కోరింగ్‌ పిచ్‌! కొన్నేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు, వందల కొద్దీ సిక్సర్లకు ఇది కంచుకోట! బౌలర్లకు సింహస్వప్నం. బ్యాటర్లకు స్వర్గధామం. సాధారణంగా బెంగళూరు స్టేడియం చాలా చిన్నది. బౌండరీ సరిహద్దులూ ఎక్కువ దూరం ఉండవు. అందుకే బ్యాటర్లు ఈజీగా సిక్సర్లు బాదేస్తారు. సెంచరీలు కొట్టేస్తారు. 2018 నుంచి ఇక్కడ ఐపీఎల్‌ తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 183. ఇదే సమయంలో ఫాస్ట్‌ బౌలర్లతో పోలిస్తే స్పిన్నర్లు ఎఫెక్టివ్‌గా ఉంటున్నట్టు స్టాటిస్టిక్స్‌ చెబుతున్నాయి. పేసర్లు 9.8 ఎకానమీతో పరుగులు ఇస్తుండగా స్పిన్నర్లు 8.1తో కట్టడి చేస్తున్నారు. చివరి ఐదు సీజన్లలో సగటున మ్యాచుకు 18 సిక్సర్లు నమోదు అవుతున్నాయి.


ఆర్సీబీ పైచేయి!


లక్నో సూపర్‌ జెయింట్స్ గతేడాదే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఇప్పటి వరకు రెండు సార్లు తలపడింది. రెండు సార్లూ ఓడింది. ఆర్సీబీ ఈ రెండు మ్యాచుల్లోనూ స్కోర్లను డిఫెండ్‌ చేసుకొంది. 2022, ఏప్రిల్‌ 19న డీవై పాటిల్‌లో జరిగిన మ్యాచులో ఆర్సీబీ మొదట 181/6 పరుగులు చేసింది. బదులుగా లక్నో 163/8కి పరిమితం అయింది. డుప్లెసిస్‌ 96 (64 బంతుల్లో) వీర బాదుడు బాదేశాడు. ఛేదనలో జోష్ హేజిల్‌వుడ్‌ 4 వికెట్లు తీసి రాహుల్‌ సేనను ఓడించాడు. 




ఎలిమినేటర్లో ఢీలా!


2022, మే 25న ఆర్సీబీ, లక్నో ఈడెన్‌ గార్డెన్స్‌లో ఎలిమినేటర్లో తలపడ్డాయి. తొలుత ఆర్సీబీ 207/4తో అదరగొట్టింది. రజత్‌ పాటిదార్‌ (112; 54 బంతుల్లో) సెంచరీ కొట్టేశాడు. ఛేదనలో రాహుల్‌ (79), దీపక్‌ హుడా (45) పోరాడినా లక్నో 193/6కు పరిమితమైంది. మళ్లీ అదే హేజిల్‌వుడ్‌ 3 వికెట్లతో రాహుల్‌ సేన నడ్డి విరిచాడు. మరి ఈ సారి ఏం జరుగుతుందో చూడాలి!!