Mohammed Siraj: సిరాజ్‌.. ఈసారి ఫైర్‌ చేసేది బుల్లెట్లే! సరికొత్త అస్త్రాలతో RCB పేసర్‌ రెడీ!

Mohammed Siraj: 'ఇంతింతై వటుడింతై..' అన్నట్టుగా ఎదుగుతున్న తెలుగు క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌! అనుభవం పెరిగే కొద్దీ కొత్త అస్త్రాలకు పదును పెడుతున్నాడు.

Continues below advertisement

Mohammed Siraj: 

Continues below advertisement

'ఇంతింతై వటుడింతై..' అన్నట్టుగా ఎదుగుతున్న తెలుగు క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌! ఆటో డ్రైవర్‌ కొడుకుగా పరిచయమైన ఈ 'హైదరాబాదీ మియా' ఇప్పుడు ఇంటర్నేషనల్‌ క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. అనుభవం పెరిగే కొద్దీ కొత్త అస్త్రాలకు పదును పెడుతున్నాడు. మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. సూపర్‌ డూపర్‌ ఫామ్‌తో ఐపీఎల్‌ 2023లో అడుగు పెడుతున్నాడు. ప్రధాన పేసర్‌గా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు విజయాలు అందించాలని పట్టుదలగా ఉన్నాడు.

ఇంటెంటే బలం!

ఏడో తరగతి నుంచి టెన్నిస్‌ బంతితోనే క్రికెట్‌ ఆడాడు మహ్మద్‌ సిరాజ్. 2015 వరకు అతడు క్రికెట్‌ బాల్‌ను ముట్టుకోలేదంటే ఆశ్చర్యమే! అలాంటిది 2017లో రూ.2.6 కోట్లకు ఐపీఎల్‌ కాంట్రాక్టు దక్కించుకొని రికార్డులు సృష్టించాడు. పొడవైన చేతులు, దృఢమైన దేహం ఉండటం అతడి ప్లస్‌ పాయింట్‌. డిసిప్టివ్‌ రనప్‌తో లెఫ్టార్మ్‌ పేసర్‌ను తలపిస్తాడు. అయితే రైట్‌ హ్యాండర్‌కు చక్కని ఇన్‌ స్వింగర్లు వేస్తుంటాడు. అతడి బౌలింగ్‌ తీరు నచ్చి సన్‌రైజర్స్‌ మెంటార్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్ అతడిని ఎంకరేజ్‌ చేశారు. ఈ కాన్ఫిడెన్స్‌తో తన రెండో రంజీ సీజన్లో 9 మ్యాచుల్లో 41 వికెట్లు తీసి కీలక బౌలర్‌గా అవతరించాడు. ఒడుదొడుకులు ఎదురైనా, ఎంతగానో ప్రేమించే తండ్రి చనిపోయినా బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో టీమ్‌ఇండియాను గెలిపించి దుమ్మురేపాడు. కొండంత ఆత్మవిశ్వాసాన్ని అందుకొని మరో రేంజుకు ఎదిగాడు.

కోహ్లీ ఎంకరేజ్‌మెంటుతో!

మహ్మద్‌ సిరాజ్ ఇప్పటి వరకు ఆరు ఐపీఎల్‌ సీజన్లు ఆడాడు. 65 మ్యాచుల్లో 33 సగటు, 8.78 ఎకానమీతో 59 వికెట్లు పడగొట్టాడు. తన జట్టు తీసిన మొత్తం వికెట్లలో అతడి వాటా 15.86 శాతం. తొలి సీజన్లో సిరాజ్‌కు ఆరు మ్యాచుల్లో అవకాశం వచ్చింది. 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. తర్వాత సీజన్లో 11 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. అయితే 2019లో ఫామ్‌ కోల్పోయాడు. ఓవర్‌కు పది చొప్పున పరుగులు ఇచ్చాడు. 9 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు. ఇలాంటి టైమ్‌లో అతడిని జట్టులోంచి తీసేయాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అతడిని నమ్మాడు. అండగా నిలిచాడు. అతడిలోని నిఖార్సైన బౌలర్‌ను బయటకు తీసుకొచ్చాడు. దాంతో సిరాజ్‌ 2020లో 9 మ్యాచుల్లో 8.69 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. 2021లో అయితే అతడిని ఆడటం కష్టంగా మారింది. 15 మ్యాచుల్లో 6.79 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి బౌలింగ్‌లో వెన్నెముకగా మారాడు. 2022లో కాస్త ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్‌ అయ్యాడు.

ఈ సారి సూపర్‌ ఫామ్‌లో!

ఐపీఎల్‌ 2023కు మహ్మద్‌ సిరాజ్‌ అద్భుతంగా సన్నద్ధమయ్యాడు. ఏడాది కాలంగా సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. టీమ్‌ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో అదరగొట్టాడు. జస్ప్రీత్‌ బుమ్రా లేని లోటు తీరుస్తున్నాడు. చక్కని రన్నప్‌తో ఆకట్టుకుంటున్నాడు. పైగా బంతితో రివర్స్‌ స్వింగ్‌ రాబడుతున్నాడు. సరైన లెంగ్తుల్లో బంతులేస్తూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీసులో అతడి బౌలింగే ఇందుకు ఉదాహరణ. ఈ మధ్యన బ్యాటర్లు ఆడలేని విధంగా తనదైన శైలిలో బౌన్సర్లు విసురుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో 11 మ్యాచులాడి 4.13 ఎకానమీతో 20 వికెట్లు తీశాడు. 2022లో అయితే 41 వికెట్లతో టాప్‌లో ఉన్నాడు. తనకు సరైన బౌలింగ్‌ పాట్నర్‌ దొరికితే సిరాజ్‌ ఈ సారి ఆర్సీబీ తరఫున అద్భుతాలు చేయగలడు.

Continues below advertisement
Sponsored Links by Taboola