Ambati Rayudu, CSK, IPL 2023: 


ఏటీ రాయుడు... అంబటి తిరుపతి రాయుడు! తెలుగు క్రికెట్‌ చరిత్రలోనే గొప్ప ఆటగాడు! వీవీఎస్‌ లక్ష్మణ్‌ తర్వాత అత్యంత ఆదరణ పొందిన తెలుగువాడు! ప్రతిభ ఎంతున్నా ముక్కుసూటి తనంతో ముందుకెళ్లడం అతడికి చేటు చేసింది. అంపైర్లు, ఆటగాళ్లు, సెలక్టర్లు, రాష్ట్ర సంఘాల యాజమాన్యాలతో గొడవలు అతడి కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఐపీఎల్‌లో మాత్రం పరుగుల వరద పారించాడు. నాలుగుసార్లు ట్రోఫీ అందుకొని మురిశాడు.


పొట్టి క్రికెట్లో గట్టి ఆటగాడు!


టీ20 క్రికెట్లో అంబటి రాయుడు ఎంతో ప్రత్యేకం! అతడి ఆటతీరుకు ఈ ఫార్మాట్‌ బాగా సూటవుతుంది. అండర్‌-19కు ఆడుతున్నప్పుడే టీమ్‌ఇండియాకు సూపర్‌ స్టార్‌ అవుతాడన్న పేరొచ్చింది. అత్యున్నత స్థాయిలో కెరీర్‌ ఒడుదొడుకుల్లో పడ్డప్పటికీ ఐపీఎల్‌లో మాత్రం ఇరగదీశాడు. 2007లో ఇండియన్‌ క్రికెట్‌ లీగులో ఆడి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యాడు. ఆ తర్వాత బీసీసీఐతో సయోధ్య కుదుర్చుకొని ఐపీఎల్‌లో అడుగుపెట్టాడు. రావడం రావడమే ప్రకంపనలు సృష్టించాడు. 2009 నుంచి 2017 వరకు ముంబయి ఇండియన్స్‌ మిడిలార్డర్లో కీలకంగా ఉన్నాడు. మూడు ట్రోఫీలు అందుకున్నాడు. 2018లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు వచ్చాడు. సీఎస్‌కేకు డెబ్యూ చేస్తూనే 608 రన్స్‌ కొట్టి తనకు తిరుగులేదని చాటుకున్నాడు. నాలుగో టైటిల్‌నూ ముద్దాడాడు.


ముంబయికి కీలకం!


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ప్రతి సీజన్లోనూ అద్భుతంగా ఆడాడు రాయుడు. ఇప్పటి వరకు 188 మ్యాచులాడి 4190 పరుగులు చేశాడు. 29 సగటు, 127 స్ట్రైక్‌రేట్‌తో చితకబాదాడు. 22 హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ, 349 బౌండరీలు, 164 సిక్సర్లు దంచికొట్టాడు. కీపింగ్‌లోనూ అదరగొట్టగలడు. మైదానంలో వేగంగా పరుగెత్తుతూ క్యాచులు అందుకోగలడు. 2010 నుంచి 2016 వరకు ఐదుసార్లు 350+ స్కోర్లు సాధించాడు. రెండు సార్లు 250+తో నిలిచాడు. ముంబయి చేసిన మొత్తం స్కోర్లలో అతడి పర్సెంటేజీ సగటున 15 శాతం వరకు ఉంటుంది. 2017లో అతడి ఫామ్‌ డిప్‌ అయింది. కేవలం 5 మ్యాచులాడి 91 పరుగులే చేశాడు.


ధోనీకి అభిమానం!


ఎంఎస్ ధోనీకి రాయుడంటే ఎందుకో చెప్పలేని అభిమానం! అతడి ఆటతీరు, బ్యాటింగ్ శైలిని ఇష్టపడతాడు. తన కెప్టెన్సీలో టీమ్‌ఇండియాకూ ఆడించాడు. మ్యాచ్‌ పరిస్థితులను బట్టి టాప్‌ నుంచి లోయర్‌ ఆర్డర్‌ వరకు అతడు ఇన్నింగ్స్‌ను తీసుకెళ్లగలడని నమ్మకం. అందుకే 2018లో అతడిని సీఎస్‌కేలోకి తీసుకున్నాడు. రావడం రావడంతోనే పూనకాలు లోడింగ్‌ అన్నట్టుగా చెలరేగాడు రాయుడు. 16 ఇన్నింగ్సుల్లో 43 సగటు, 150 స్ట్రైక్‌రేట్‌తో 602 రన్స్‌ చేశాడు. లీగు సాగే కొద్దీ విధ్వంసపు రేటును మరింత పెంచాడు. సన్‌రైజర్స్‌పై 62 బంతుల్లో అజేయ సెంచరీ బాదేశాడు. సీఎస్‌కేకు ట్రోఫీ అందించాడు. 2020లో 359 రన్స్‌ చేశాడు. మిగతా మూడు సీజన్లలో 250+ స్కోర్లు సాధించాడు. గతేడాది సీఎస్‌కే పేలవ ప్రదర్శన తర్వాత ఇదే చివరి సీజన్‌ అని ప్రకటించాడు. మళ్లీ యాజమాన్యం మాట్లాడటంతో యూటర్న్‌ తీసుకున్నాడు. ఈ సీజన్లో అతడిపై ధోనీసేన భారీ ఆశలే పెట్టుకొంది.