IPL 2023, SRH vs KKR: ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈడెన్ గార్డెన్స్‌లోనే కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కోల్‌కతా నైట్ రైడర్స్ 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగగా, నితీష్ రానా సారథ్యంలోని నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ నితీశ్ రానా, రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయారు.


పాయింట్ల పట్టికలో ఏం మారింది?
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో విజయం. ఇప్పటివరకు ఈ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడగా, అందులో రెండిట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నాలుగు పాయింట్లు లభించాయి. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది.


పాయింట్ల పట్టికలో కోల్‌కతా నైట్ రైడర్స్ నాలుగో స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం టాప్-4 జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రాజస్థాన్ రాయల్స్‌తో పాటు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు టాప్-4 స్థానాల్లో ఉన్నాయి.


పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ జట్ల పతనం
ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికను పరిశీలిస్తే, రాజస్థాన్ రాయల్స్ జట్టు నంబర్ వన్ స్థానంలో ఉంది. 16వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. అందులో మూడిట్లో విజయం సాధించింది. ఒకటి ఓడిపోయింది. సంజూ శాంసన్ జట్టు ఆరు పాయింట్లు, మెరుగైన నెట్ రన్ రేట్‌తో నంబర్ వన్ స్థానంలో ఉంది.


లక్నో సూపర్ జెయింట్ కూడా 4 మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ కూడా ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. దీంతో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ అవే నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో, పంజాబ్ కింగ్స్ నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి. అదే సమయంలో హైదరాబాద్ విజయం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎనిమిదో స్థానానికి, ముంబై ఇండియన్స్ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. కాగా పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి స్థానంలో ఉంది.


ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కాస్ట్లీ ఓపెనర్ హ్యారీ బ్రూక్ (100 నాటౌట్: 55 బంతుల్లో, 12 ఫోర్లు, మూడు సిక్సర్లు) అద్భుత శతకంతో అజేయంగా నిలిచాడు. తనతో పాటు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (50: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించాడు.


229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 205 పరుగులకు పరిమితం అయింది. కెప్టెన్ నితీష్ రానా (75: 41 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, రీసెంట్ సెన్సేషన్ రింకూ సింగ్ (58 నాటౌట్: 31 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అజేయ అర్థ శతకం సాధించాడు.