IPL 2023 Playoffs Schedule: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 లీగ్‌ స్టేజ్‌ ముగిసింది. దాదాపుగా రెండు నెలలు గ్రూప్‌ స్టేజ్‌ జరిగింది. 10 జట్లు 70 మ్యాచుల్లో అభిమానులను మురిపించాయి. ప్లేఆఫ్‌ చేరిన నాలుగింట్లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌ రెండు ఉండటంతో నాకౌట్‌పై మరింత ఇంట్రెస్ట్‌ పెరిగింది. వీటి షెడ్యూలు, వేదికల వివరాలు మీకోసం!




ప్లేఆఫ్‌ చేరిన టీమ్స్‌!


ఐపీఎల్‌ 2023లో ఆరంభంలో ఊహించింది ఒకటి. చివరికి జరిగింది మరొకటి! అంచనాలతో వచ్చిన జట్లు మధ్యలోనే ఆగిపోయాయి. చేరడం కష్టమే అనుకున్న టీమ్స్‌ ప్లేఆఫ్‌లో అడుగు పెట్టాయి. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Titans) తమది వాపు కాదని తేల్చి చెప్పింది! 20 పాయింట్లతో మళ్లీ టేబుల్‌ టాపర్‌గా అవతరించింది. ఎక్స్‌పీరియన్స్‌ బౌలర్లు లేకపోవడంతో లిమిటెడ్‌ రిసోర్సెస్‌తో బరిలోకి దిగింది చెన్నై! తన కెప్టెన్సీ చాకచక్యంతో ధోనీ రెండో స్థానంలో నిలిపాడు. కేఎల్‌ రాహుల్‌ మధ్యలోనే దూరమైనా గౌతమ్‌ గంభీర్ (Gautam Gambhir) తన వ్యూహాలతో లక్నోను ప్లేఆఫ్‌కు తీసుకొచ్చాడు. బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్ వీక్‌గా ఉన్నా మిడిలార్డర్‌ విజృంభణతో ముంబయి ప్లేఆఫ్‌కు వచ్చేసింది.


Also Read: RCB vs GT ఓటమి తర్వాత Kohli టార్గెట్ గా నవీన్ మీమ్


వేదికలు ఇవే!


ప్లేఆఫ్‌లో మొత్తం నాలుగు మ్యాచులు ఉంటాయి. రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్‌ ఉంటుంది. ఆఖర్లో మెగా ఫైనల్‌ జరుగుతుంది. ఇందుకోసం ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ రెండు వేదికలను ఎంపిక చేసింది. చెన్నైలోని చెపాక్‌ (Chepauk), అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియాలను (Motera) సిద్ధం చేస్తోంది. క్వాలిఫయర్‌-1, ఎలిమినేటర్‌ మ్యాచులకు చిదంబరం ఆతిథ్యమిస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇక్కడ సీట్ల సంఖ్యను పెంచారు. అన్ని స్టాండ్స్‌లోకి అభిమానులను అనుమతిస్తున్నారు. ఇక మొతేరాలో 11 పిచ్‌లు ఉన్న సంగతి తెలిసిందే. పైగా లక్షా పదివేల మంది నేరుగా మ్యాచ్‌ను వీక్షించొచ్చు.




నాకౌట్‌ షెడ్యూల్‌!


క్వాలిఫయర్‌ వన్‌ ఈ నెల 23, మంగళవారం రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది. తొలి రెండు స్థానాల్లో గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings) ఇందులో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టు క్వాలిఫయర్‌ 2 కోసం వేచి చూస్తుంది. ఇక బుధవారం రాత్రి 7:30 గంటలకు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఉంటుంది. ఇందులో లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG), ముంబయి ఇండియన్స్‌ (MI) పోటీ పడతాయి. ఓడిన జట్టు ఇక్కడితో టోర్నీ ముగిస్తుంది. గెలిచిన టీమ్‌ మే 26, శుక్రవారం క్వాలిఫయర్‌ 2 ఆడుతుంది. బహుశా చెన్నై లేదా గుజరాత్‌ అపోనెంట్స్‌గా ఉంటాయి. అందులో గెలిచిన టీమ్‌ మే 28, ఆదివారం రాత్రి ఫైనల్‌ ఆడతాయి.