MI vs KKR, IPl 2023:


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఆదివారం సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది! ముంబయి ఇండియన్స్‌కు చెందిన ఇద్దరు కెప్టెన్లు నేడు టాస్‌కు వస్తారని తెలిసింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచు టాస్‌కు రోహిత్‌ శర్మతో పాటు మహిళల జట్టు సారథి, డబ్ల్యూపీఎల్‌ ట్రోఫీ విజేత హర్మన్‌ప్రీత్‌ వస్తోందని సమాచారం.




రిలయన్స్‌ ఫౌండేషన్‌, ముంబయి ఇండియన్స్‌ కలిసి 'అందరికీ ఆటలు, విద్య' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేటి మ్యాచును బాలికలకు అంకితం చేస్తోంది. అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుండాలని మరీ ముఖ్యంగా క్రీడలు, చదువులో చురుగ్గా ఉండాలన్నది నీతా అంబానీ కల!


ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ నినాదంతో జరిగే నేటి మ్యాచును వీక్షించేందుకు ఏకంగా 19వేల మంది అమ్మాయిలు వాంఖడేకు రానున్నారు. ముంబయి నగరంలోని 36 స్వచ్ఛంద సంస్థలకు చెందిన అమ్మాయిలు స్టేడియానికి వస్తున్నారని ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలిపింది. ఈ మ్యాచు కోసం టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. అంటే నేడు వాంఖడే నీలి రంగు పులుము కోవడం ఖాయం.




'ముంబయి ఇండియన్స్‌ కొన్నేళ్లు ఈఎస్‌ఏ డే నిర్వహిస్తోంది. నేనూ ఇందులో భాగం అవుతున్నాను. బాలికల ఎదుట ఆడటం చాలా బాగుంటుంది. క్రికెట్‌, ఇతర క్రీడల్లో వారు చురుగ్గా పాల్గొనేందుకు ఇలాంటివి మోటివేట్‌ చేస్తాయి. క్రీడలు వారి ఎదుగుదలకు ఉపయోగపడతాయి' అని ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ అన్నాడు. 'నీతా అంబానీ, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఈఎస్‌ఏ డే నిర్వహించడం అద్భుతం. ఈ విషయం తెలియగానే ఎంతో ఆనందం వేసింది' అని హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపింది.




ఐపీఎల్‌ 2023లో ముంబయి ఇండియన్స్‌ నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతోంది. ఈ సీజన్లో మూడు మ్యాచులు ఆడిన ముంబయి ఒకటి గెలిచింది. రెండింట్లో ఓడింది. ఒకప్పటితో పోలిస్తే ప్రదర్శన అంతగా బాగాలేదు. ఆటగాళ్లు గాయపడ్డారు. కీలక క్రికెటర్లు ఫామ్‌లో లేరు.


ముంబై ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.


కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.