MI vs KKR, IPL 2023: 


ఐపీఎల్‌ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రెచ్చిపోతోంది! తమదైన బ్యాటింగ్‌తో దుమ్మురేపుతోంది. పిచ్‌.. బౌలింగ్‌తో సంబంధం లేకుండా భారీ స్కోర్లు చేస్తూనే ఉంది. ఆదివారం వాంఖడేలో ముంబయి ఇండియన్స్‌కు ఏకంగా 186 టార్గెట్‌ సెట్‌ చేసింది. చిచ్చరపిడుగు.. పొడగరి.. వెంకటేశ్ అయ్యర్‌ (104; 51 బంతుల్లో 6x4, 9x6) ఇండియన్‌ ప్రీమియర్ లీగులో సరికొత్త మైలురాయి అందుకున్నాడు. తొలి సెంచరీ సాధించాడు. మెక్‌కలమ్‌ తర్వాత కేకేఆర్‌లో సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా అవతరించాడు. ఆఖర్లో ఆండ్రీ రసెల్‌ (21;11 బంతుల్లో 3x4, 1x6) మెరిశాడు. హృతిక్‌ షోకీన్ 2 వికెట్లు పడగొట్టాడు.




వెంకీ అయ్యర్‌.. అదుర్స్‌!


మధ్యాహ్నం మ్యాచ్‌.. డ్రై పిచ్‌.. గ్రిప్‌ అవుతున్న బంతి! పరిస్థితులు బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలంగా లేవు. కామెరాన్‌ గ్రీన్‌ వేసిన .15వ బంతికే ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ (0) ఔటయ్యాడు. మరో ఓపెనర్‌ రెహ్మనుల్లా గుర్బాజ్‌ (8) మరోసారి విఫలమయ్యాడు. అయినప్పటికీ పవర్‌ ప్లే ముగిసే సరికి కేకేఆర్‌ 52/2తో నిలిచిందంటే వెంకటేశ్ అయ్యర్‌ చలవే! ఆరంభంలోనే మోకాలికి బంతి తగిలి విలవిల్లాడిని అతడు.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పరుగెత్తడం కష్టం కావడంతో సిక్సర్లు, బౌండరీలు బాదడమే పనిగా పెట్టుకున్నాడు. జస్ట్‌ 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు. రెండో వికెట్‌కు గుర్బాజ్‌తో కలిసి 22 బంతుల్లోనే 46 రన్స్‌ భాగస్వామ్యం అందించాడు. నితీశ్ రాణా (5) త్వరగానే డగౌట్‌కు చేరుకున్నాడు.




కేకేఆర్‌ సెకండ్ హీరో


ఈ సిచ్యువేషన్లో శార్దూల్‌ ఠాకూర్‌ (13)తో కలిసి వెంకటేశ్ ఇన్నింగ్స్‌ నడిపించాడు. అతడితో కలిసి నాలుగో వికెట్‌కు 28 బంతుల్లోనే 50 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 123 వద్ద శార్దూల్‌ను షోకీన్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత రింకూ సింగ్‌ (18) నిలకడగా ఆడాడు. వెంకీకి అండగా నిలిచాడు. దాంతో 16.3 ఓవర్లకే కేకేఆర్‌ స్కోరు 150కి చేరుకుంది. స్ట్రాటజిక్‌ టైమౌట్‌ తర్వాత 90 వద్ద ఉన్న వెంకీ కాస్త స్లోగా ఆడాడు. పియూష్‌, షోకీన్‌ బౌలింగ్‌లో రిస్క్‌ తీసుకోలేదు. సింగిల్స్‌, డబుల్స్‌ తీసి 49 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. మెక్‌కలమ్ తర్వాత కేకేఆర్‌కు సెంచరీ కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 17.2వ బంతిని రివర్స్‌ స్కూప్‌తో బౌండరీకి పంపించాలని వెంకీ ప్రయత్నించాడు. మిస్‌టైమ్‌ కావడంతో గాల్లోకి లేచిన బంతిని జన్‌సెన్‌ అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాత ఆండ్రీ రసెల్‌ కొన్ని షాట్లు ఆడి స్కోరును 185/6కి చేర్చాడు.