Yashasvi Jaiswal: ఐపీఎల్ 2023 56వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది.
అనంతరం రాజస్థాన్ 13.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 151 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేయలేకపోయాడు. 47 బంతుల్లో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మ్యాచ్ అనంతరం యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్ గురించి పలు విషయాలు వెల్లడించాడు. తనెప్పుడూ బాగా ఆడాలి అనేదే మనసులో ఉంటుందన్నాడు. ‘ఇదొక మంచి అనుభూతి. నేను కోరుకున్నది జరుగుతుందని కాదు. నేను బాగా సిద్ధం చేసుకుంటాను. నన్ను నేను నమ్ముతాను. ఫలితాలు వస్తాయని నాకు తెలుసు. విన్నింగ్ షాట్ గొప్ప అనుభూతిని కలిగించింది. నేను గేమ్‌ను ముగించాలనుకున్నాను. గేమ్‌ను గెలవడం నా లక్ష్యం.’ అన్నాడు.
సెంచరీని కోల్పోవడంపై కూడా యశస్వి జైస్వాల్ స్పందించాడు. ‘నా మనస్సులో నెట్ రన్ రేట్ మాత్రమే ఉంది. నేను, సంజు ఆటను ముందుగానే ముగించడం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం.’ అన్నాడు.
మరోవైపు బట్లర్ రనౌట్‌పై మాట్లాడుతూ, ‘ఇది గేమ్‌లో జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఇది నాకు మెరుగ్గా రాణించాల్సిన బాధ్యతను ఇస్తుంది. సంజూ భాయ్ వచ్చి నీ ఆట ఆడుతూ ఉండు. ఆ రనౌట్ గురించి ఆలోచించకు అన్నాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలకు నాలాంటి యువకులు వచ్చి ప్రదర్శన చేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. కలలను నెరవేర్చుకోవడానికి నాలాంటి ఆటగాళ్లకు ఇదొక గొప్ప వేదిక.’ అన్నాడు.
ఈ కీలక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ కేవలం 13.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఈ లక్ష్యాన్ని ఛేదించింది.
యశస్వి జైస్వాల్ (98 నాటౌట్: 47 బంతుల్లో, 13 ఫోర్లు, ఐదు సిక్సర్లు) నిస్వార్థమైన ఇన్నింగ్స్‌తో రాజస్తాన్‌ను దగ్గరుండి గెలిపించాడు. తనకు సంజు శామ్సన్ (48 నాటౌట్: 29 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. అంతకు ముందు కోల్‌కతా బ్యాటర్లలో అర్థ సెంచరీ సాధించిన వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్థ సెంచరీని యశస్వి జైస్వాల్ సాధించాడు. కేవలం 13 బంతుల్లోనే యశస్వి జైస్వాల్ అర్థ శతకం పూర్తయింది.