IPL 2023, Points Table:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 పాయింట్ల పట్టిక మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. చాలా వరకు జట్లన్నీ పదో నంబర్ జంక్షన్‌లో జామ్ అయ్యాయి. నాలుగు జట్లు 10 పాయింట్లు, రెండు జట్లు 11 పాయింట్లతో ఉన్నాయి. ప్లేఆఫ్ చేరుకొనేందుకు ఇవన్నీ గట్టిగా పోరాడే అవకాశం ఉంది. టేబుల్ టాపర్ సంగతి పక్కన పెడితే కనీసం మూడు జట్లు స్వల్ప మార్జిన్‌తోనే ప్లేఆఫ్ చేరుకొనేలా కనిపిస్తోంది.
ఐపీఎల్ 2023లో బుధవారం రెండు మ్యాచులు జరిగాయి. మొదటి పోరులో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. రెండో మ్యాచులో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఢీకొన్నాయి. ఈ మ్యాచుల తర్వాతే పాయింట్ల పట్టికలో ట్రాఫిక్ జామ్ పెరిగిపోయింది.
ఏకనా స్టేడియంలో జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. మరో మూడు బంతులు మిగిలునప్పుడు వర్షం మొదలైంది. ఎంతకీ ఎడతెరపి నివ్వలేదు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఛేదనకు రాలేకపోయింది. సాయంత్రం 7 గంటల వరకు వేచిచూసిన నిర్వాహకులు రెండు జట్లకు చెరో పాయింటును పంచేశారు. దాంతో మెరుగైన రన్‌రేట్ 0.639 ఉన్న లక్నో రెండో పొజిషన్లో నిలిచింది. 10 మ్యాచుల్లో 5 గెలిచి 4 ఓడింది. ఇక చెన్నైదీ ఇదే పరిస్థితి. 0.329 రన్‌రేట్, 11 పాయింట్లతో మూడో ప్లేస్‌లో ఉంది. పదింట్లో ఐదు గెలిచి నాలుగు ఓడింది. ఒక ఫలితం తేలలేదు.
మొహాలిలో పంజాబ్ కింగ్స్ నిర్దేశించి 215 టార్గెట్‌ను ముంబయి ఇండియన్స్ ఊదేసింది. పది పాయింట్లు అందుకుంది. రన్‌రేట్‌నూ మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి దూసుకుపోయింది. ఇప్పటి వరకు 9 మ్యాచులాడిన హిట్‌మ్యాన్ సేన 5 గెలిచి 4 ఓడింది. మిగిలిన మ్యాచులో మంచి ప్రదర్శన చేస్తే కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకోగలదు. ఇక పది మ్యాచులాడిన గబ్బర్ సేన 5 గెలిచి 5 ఓడి 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ముంబయి తన తర్వాతి మ్యాచులో చెన్నైతో తలపడనుంది.
రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచుల్లో 5 గెలిచి 4 ఓడింది. పది పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. పైగా 0.800 మెరుగైన రన్‌రేట్ దాని సొంతం. మొదట్లో వరుస విజయాలు అందుకున్న సంజూ సేన కాస్త వెనక్కి తగ్గింది. మళ్లీ గాడిలో పడితే ప్లేఆఫ్ చేరుకోవడం పక్కా! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుదీ ఇదే పరిస్థితి. 9లో 5 గెలిచింది. -0.030 రన్‌రేట్‌తో ఐదో ప్లేస్‌లో ఉంది. ఇకపై ఇదే కసిని ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది.
కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్ ఆరు పాయింట్లతో వరుసగా 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా, దిల్లీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే 9 మ్యాచులు ఆడేశాయి. ఇకపై జరిగే ఏ ఒక్క మ్యాచులో ఓడినా ఆశలు గల్లంతు అవుతాయి. ఆరెంజ్ ఆర్మీకి ఇప్పటి వరకు 8 మ్యాచులే ఆడింది. అంటే ఒకట్రెండు మ్యాచుల్లో ఓటమి పాలైనా ప్లేఆఫ్ చేరేందుకు ఆశలు సజీవంగా ఉంటాయి.