IPL 2023, GT vs MI:
మోతేరా.. మళ్లీ మోతమోగింది! హోమ్ టీమ్ గుజరాత్ టైటాన్స్ విరుచుకుపడింది. ముంబయి ఇండియన్స్ ముందు భారీ టార్గెట్ ఉంచింది. 20 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (56; 34 బంతుల్లో 7x4, 1x6) కెరీర్లో 17వ హాఫ్ సెంచరీ బాదేశాడు. ఆఖర్లో కుర్రాడు.. అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేశాడు. డేవిడ్ మిల్లర్ (46; 22 బంతుల్లో 3x4, 3x6)తో కలిసి డెత్ ఓవర్లలో మైటీ ముంబయి.. బౌలర్లను ఊచకోత కోశాడు.
గిల్.. అదే క్లాస్!
మూడో ఓవర్లోనే వికెట్ పడ్డా గుజరాత్ టైటాన్స్ పవర్‌ప్లేలో మంచి స్కోరే చేసింది. ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్‌ను క్యాపిటలైజ్ చేసుకొని 50/1తో నిలిచింది. జట్టు స్కోరు 12 వద్దే వృద్ధిమాన్ సాహా (4)ను జూనియర్ తెందూల్కర్ పెవిలియన్‌కు పంపించినా.. గిల్ నిలబడ్డాడు. హార్దిక్ పాండ్య (13)తో కలిసి రెండో వికెట్‌కు 24 బంతుల్లో 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తన బ్యాటింగ్‌లోని సొగసును ప్రదర్శించాడు. అమేజింగ్ కవర్‌డ్రైవ్‌లు.. లాఫ్టెడ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. 6.1వ బంతికి పాండ్యను పియూష్ చావ్లా ఔట్ చేయడంతో విజయ్ శంకర్ (19; 16 బంతుల్లో) కలిసి మూడో వికెట్‌కు 30 బంతుల్లో 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
కిల్లర్.. మనోహర్!
శుభ్‌మన్ గిల్ జస్ట్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. జట్టు స్కోరు 91వద్ద అతడిని కుమార్ కార్తికేయ ఔట్ చేసి బ్రేకిచ్చాడు. 12.1 ఓవర్లకు గుజరాత్ స్కోరు 100 పరుగుల మైలురాయి అందుకుంది. మధ్యలో జీటీ రన్‌రేట్ కాస్త తగ్గినట్టు అనిపించినా.. ఆఖర్లో అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ కలిసి ముంబయి బౌలింగ్‌ను ఊచకోత కోశారు. సిక్సర్లు.. బౌండరీలతో దుమ్మురేపారు. 35 బంతుల్లోనే 71 రన్స్ పాట్నర్‌షిప్‌తో పాండ్య సేనను పటిష్ఠ స్థితికి తీసుకెళ్లారు. మెరిడీత్ వేసిన 18.1వ బంతికి మనోహర్ ఔటయ్యాక.. కిల్లర్ మిల్లర్ తన పని మొదలెట్టాడు. అదే ఓవర్లో మూడు సిక్సులు బాదేశాడు. తర్వాతి ఓవర్లో రాహుల్ తెవాతియా (20*; 5 బంతుల్లో 3x6) ఓ రెండు సిక్సులు కొట్టడంతో జీటీ 207/6తో నిలిచింది.