SRH vs DC IPL 2023:


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో మ్యాచులను గెలిపించే బ్యాలర్లు ఉన్నారని కెప్టెన్‌ అయిడెన్‌ మార్‌క్రమ్‌ అన్నాడు. అయితే ఆడాలన్న తపన.. గెలిపించాలన్న కసి వారిలో కనిపించడం లేదని విమర్శించాడు. తమ బ్రాండ్‌ ఆఫ్ క్రికెట్‌ ఆడటం లేదని పేర్కొన్నాడు. దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో పరాజయం తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.




'మేం బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమయ్యాం. ఇంటెంట్‌ కనిపించలేదు. దురదృష్టవశాత్తు మేం మ్యాచులను గెలిచే జట్టుగా కనిపించడం లేదు. మ్యాచ్‌ తర్వాత మరింత మెరుగ్గా ఎలా ఛేజ్‌ చేయాలో ఆలోచించుకోవాలి. స్వేచ్ఛగా మా అభిప్రాయాలు తెలుసుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలం. పనులన్నీ సరిగ్గానే చేయాలని అనుకుంటాం. కానీ కుర్రాళ్లు వాటిని అలవాటు చేసుకోవాలి కదా! ఆరెంజ్‌ ఆర్మీ బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ ఆడాలని అనుకున్నాం. దానిని సరిగ్గా అమలు చేస్తేనే రాత్రి సరిగ్గా నిద్రపోగలం' అని మార్‌క్రమ్‌ అన్నాడు.


'దురదృష్టవశాత్తు దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచులో అయితే మాలో కసి కనిపించలేదు. అత్యుత్తమంగా ఆడేందుకు ఏం చేయాలో కుర్రాళ్లు ఆలోచించాలి. వారు స్వేచ్ఛగా ఆడాలి. మా బౌలర్లను చూస్తుంటే గర్వంగా ఉంది. గేమ్‌ ప్లాన్స్‌ను వారు అద్భుతంగా అమలు చేశారు. పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్నారు. మేం మా బ్యాటింగ్‌తో వారిని నిరాశపరిచాం. ఇలాంటి మ్యాచులో మా బౌలర్లను ఓటమి వైపు ఉంచడం బాధాకరం' అని మార్‌క్రమ్‌ అన్నాడు.




Delhi Capitals vs Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2023 సీజన్ 34వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులకు పరిమితం అయింది. దీంతో ఢిల్లీకి టోర్నీలో వరుసగా రెండో విజయం దక్కింది. సన్‌రైజర్స్‌కు మాత్రం వరుసగా మూడో ఓటమి.


సన్‌రైజర్స్ బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ (49: 39 బంతుల్లో, ఏడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ (31: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), వాషింగ్టన్ సుందర్ (24 నాటౌట్: 15 బంతుల్లో, మూడు ఫోర్లు) చివర్లో పోరాడారు. హ్యారీ బ్రూక్ (7: 14 బంతుల్లో), రాహుల్ త్రిపాఠి (15: 21 బంతుల్లో), ఎయిడెన్ మార్క్రమ్ (3: 5 బంతుల్లో), అభిషేక్ శర్మ (5: 5 బంతుల్లో) దారుణంగా విఫలం అయ్యారు. ఢిల్లీ బ్యాటర్లలో మనీష్ పాండే (34: 27 బంతుల్లో, రెండు ఫోర్లు), అక్షర్ పటేల్ (34: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు పడగొట్టాడు.