Suryakumar Yadav:


మూడు బంతుల్లో మూడుసార్లు డకౌటైన విషయాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) త్వరగా మర్చిపోవాలని సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) అన్నాడు. ఐపీఎల్‌ తాజా సీజన్లో పరుగుల వరద పారించాలని సూచించాడు. అప్పుడే వన్డే ప్రపంచకప్‌ ఆడేందుకు ఆత్మవిశ్వాసం వస్తుందని పేర్కొన్నాడు. కెరీర్లో ఎంత గొప్ప బ్యాటర్‌కైనా ఇలాంటి సందర్భాలు తప్పవని వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో ఓటమి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు.


'అవును, అతడు మూడుసార్లు మొదటి బంతికే ఔటయ్యాడు. ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పడం కష్టం. తొలి రెండు మ్యాచుల్లో మిచెల్‌ స్టార్క్‌ రెండు అద్భుతమైన బంతులేశాడు. సూర్యకుమార్‌ బహుశా ఆత్రుత పడుతున్నాడేమో' అని సునిల్‌ గావస్కర్‌ అన్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ముంబయి ఇండియన్స్‌ తరఫున బాగా ఆడటాన్ని బట్టి అతడికి వన్డే జట్టులో చోటు ఉంటుందన్నాడు. ఇప్పటి వరకు సూర్యకుమార్‌ యాదవ్‌ 23 వన్డేలు ఆడి 24 సగటుతో 433 పరుగులే చేయడం గమనార్హం.


'ఐపీఎల్‌లో సూర్యకుమార్‌ ఫామ్‌ను బట్టి వన్డే జట్టులో చోటు దొరుకుతుంది. లీగు తర్వాత వెస్టిండీస్‌తో వన్డేలు ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అతడికి చెప్పేందుకేమీ లేదు. అత్యుత్తమ క్రికెటర్లకూ ఇలాంటివి తప్పలేదని అతడు అర్థం చేసుకోవాలి. మున్ముందూ జరుగుతాయని గ్రహించాలి. ఐపీఎల్‌పై (IPL 2023) ఫోకస్‌ చేయడమే అతడి ముందున్న కర్తవ్యం. ఈ మూడు వన్డేల గురించి మర్చిపోవాలి. ఐపీఎల్‌లో పరుగులు చేస్తే వన్డే జట్టులో పునరాగమనం చేస్తాడు' అని సన్నీ చెప్పాడు.


టీ20 క్రికెట్లో సూర్యకుమార్‌ యాదవ్‌ తిరుగులేని ఆటగాడు. క్రీజులో ఎక్కడ్నుంచి ఎక్కడికైనా బంతిని బాదేయగలడు. 2022లో పొట్టి క్రికెట్లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌కు చేరుకున్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లేకపోవడంతో అతడికి వన్డేల్లో చోటిచ్చారు. అయితే ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేల్లోనూ గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో మిచెల్‌ స్టార్క్‌ వేసిన సేమ్‌ బంతులకు పెవిలియన్‌ చేరాడు. కీలకమైన చెన్నై వన్డేలో అతడిని ఏడో స్థానంలో పంపించారు. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అతడు ఏస్టన్‌ ఏగర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.


Also Read: ‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు


ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (54: 72 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ కోల్పోయింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే భారత్‌ను ఓడించింది.