Surya Kumar Yadav: టీ20లలో ప్రపంచంలోనే నెంబర్ వన్ బ్యాటర్.. బరిలోకి దిగితే సిక్సర్ల మోతతో ప్రత్యర్థులను హడలెత్తించే టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది. అతడు టీ20లకు తప్ప మిగిలిన ఫార్మాట్లకు పనికిరాడా..? వన్డేలు ఆడటం సూర్యకు చేతకాదా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. మాజీ క్రికెటర్ల అభిప్రాయాలు, ఫ్యాన్స్ విమర్శలు, టీమ్ మేనేజ్మెంట్ ఆందోళన కంటే కూడా వన్డేలలో
సూర్య గణాంకాలు చూస్తే ఇదే నిజమనిపించిక మానదు. టీ20లలో బంతి పడితే దానిని 360 డిగ్రీల కోణంలో ఆడే సూర్య.. వన్డేలలో మాత్రం కనీసం క్రీజులో నిలుచోడానికే తంటాలు పడుతున్నాడు. అతడి ప్రదర్శనలతో విసిగిపోయిన అభిమానులు.. అతడు ‘సూర్య’కుమార్ కాదు.. ‘శూణ్య’కుమార్ అని ఆటాడుకుంటున్నారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో భాగంగా సూర్యకుమార్.. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ ‘సున్నాలు’ చుట్టాడు. అదేదో పది, పదిహేను బంతులాడి బౌలర్లను అర్థం చేసుకునే క్రమంలో నిష్క్రమించింది కాదు. రావడం పోవడమే. అదేదో సినిమాలో చెప్పినట్టు.. ‘అంతా కమ్ అండ్ గో లా అయిపోయింది’అనే మాదిరిగా అయిపోంది సూర్య బ్యాటింగ్.
గణాంకాలు చెబుతున్న చేదు నిజం..
0, 0, 0, 14, 0, 31, 4, 6, 34, 4.. గడిచిన పది వన్డే ఇన్నింగ్స్ లలో నయా మిస్టర్ 360 చేసిన స్కోర్లవి. అంటే పది ఇన్నింగ్స్ లలో కలిపి వంద పరుగులు కూడా చేయలేదు. టీ20లలో నమ్మదగ్గ బ్యాటర్ గా ఉన్న సూర్య.. వన్డేలలో మాత్రం అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. తాను ఈ ఫార్మాట్ కు పనికిరానని తనకు తానే పదేపదే నిరూపించుకుంటున్నాడా..? అనిపించేలా ఉంది వన్డేలలో సూర్య ఆట.
భారత్ కు ప్రత్యామ్నాయం తప్పదా..?
సూర్య ప్రదర్శన అతడికి మాత్రమే కాదు.. భారత జట్టుకూ ఆందోళన కలిగించేదే. అసలే ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనుంది. ఈ మేరకు భారత్ తో పాటు అన్ని జట్లూ ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే టీమిండియాకు గాయాల బెడద వేధిస్తున్నది. బుమ్రా, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ తో పాటు దీపక్ చాహర్ లు ఈ మెగా టోర్నీ వరకైనా అందుబాటులో ఉంటారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. వన్డేలలో అయ్యర్ స్థానాన్ని భర్తే చేస్తాడని భావిస్తున్నా సూర్య మాత్రం అందుకు విరుద్ధంగా వరుస వైఫల్యాలతో విసుగు తెప్పిస్తున్నాడు.
ఇప్పటికే భారత జట్టు వరల్డ్ కప్ కోసం 20 మందితో కూడిన కోర్ టీమ్ ను ఎంపిక చేసి వారినే రొటేట్ చేస్తూ మెగా టోర్నీ వరకూ సిద్ధం చేయాలని భావిస్తుండగా సూర్య ఫామ్ ఆందోళన కలిగించేదే. దీంతో సూర్యను వన్డేల నుంచి తప్పించి ఆ స్థానాన్ని సంజూ శాంసన్ తో భర్తీ చేయించాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.