IPL 2023, Rohit Sharma:
ఇక నుంచి ఆటగాళ్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల (IPL Franchises) సొంతమని టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. క్రికెటర్ల వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ వారిదేనని పేర్కొన్నాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు అందరూ ఫిట్‌గా ఉండటం ముఖ్యమన్నాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), రిషభ్ పంత్, జస్ప్రీత్ వంటి క్రికెటర్లు గాయాల పాలవ్వడం గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు.
'ఇప్పట్నుంచి ఫ్రాంచైజీలదే బాధ్యత. ఆటగాళ్లు ఇప్పుడు వారి సొంతం. మేం వారికి కొన్ని సూచనలు చేశాం. ఎంత వరకు ఆడించాలో లక్ష్మణ రేఖ గీశాం. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది ఫ్రాంచైజీలే. మరీ ముఖ్యంగా ఆటగాళ్లు. ఎందుకంటే వారి దేహ రక్షణకు వారిదే బాధ్యత. వారంతా పెద్దోళ్లే. అలసటగా అనిపిస్తే మాట్లాడి 1-2 మ్యాచులకు విశ్రాంతి తీసుకోవచ్చు. అలాగే చేస్తారని అనుకుంటున్నా' అని హిట్‌మ్యాన్ చెప్పాడు.
'ఆటగాళ్ల గాయాలు ఆందోళనకు గురిచేస్తాయన్నది నిజమే. ప్లేయింగ్ లెవన్‌లో ఉండే క్రికెటర్లను ఇప్పటికే మిస్సవుతున్నాం. అందరూ అందుబాటులో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారు. మేం వారి పనిభారం నిర్వహణపై దృష్టి సారించాం. కొందరికి కచ్చితంగా రెస్ట్ ఇవ్వడం మీరు చూస్తూనే ఉన్నారు. మేం మా చేతనైంత వరకు చేస్తున్నాం. అయితే కుర్రాళ్లు ఎందుకు గాయపడుతున్నారో కచ్చితంగా చెప్పేందుకు నేనేమీ స్పెషలిస్టును కాదు. ప్రపంచకప్‌నకు 15 మందిని పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉంచేందుకు మా మెడికల్ టీమ్స్ పనిచేస్తున్నాయి' అని రోహిత్ తెలిపాడు.
'ఎక్కువ క్రికెట్ ఆడితే గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అందుబాటులో ఉన్నవారితోనే జట్టును బరిలోకి దించుతున్నాం. మన చేతుల్లో లేని వాటిని కంట్రోల్ చేయలేం. ఆటగాళ్లు ప్రతి మ్యాచ్ ఆడాలనే కోరుకుంటున్నారు. వారిని సురక్షితంగా ఉంచేందుకు సపోర్ట్ స్టాఫ్ ఎంతో శ్రమిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు గాయాలు అవుతూనే ఉంటాయి. శ్రేయస్ అయ్యరే ఇందుకు ఉదాహరణ. రోజంతా కూర్చున్నాడు. ఒకే ఇన్నింగ్స్ ఆడబోయి గాయపడ్డాడు. వీటిని కంట్రోల్ చేసేందుకే ప్రయత్నిస్తున్నాం' అని రోహిత్ వెల్లడించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. 270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ (54: 72 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌట్ అయింది. 2019 తర్వాత భారత్ స్వదేశంలో సిరీస్ కోల్పోయింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే భారత్‌ను ఓడించింది.