LSG vs MI IPL 2023 Eliminator: ఐపీఎల్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. వారు ముంబై ఇండియన్స్ చేతిలో 81 పరుగుల తేడాతో ఓడిపోయారు. ముంబై విజయంలో ఆకాష్ మధ్వాల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ఓటమితో లక్నో పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. ప్లేఆఫ్స్‌లో అతి తక్కువ పరుగులు చేసిన మూడో జట్టుగా లక్నో నిలిచింది. 2010లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై డెక్కన్ ఛార్జర్స్ 82 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది ప్లేఆఫ్స్‌లో అత్యంత తక్కువ స్కోరు.


ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో జట్టు 101 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఇది మూడో అత్యల్ప స్కోరు. అంతకుముందు ఐపీఎల్ 2010లో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ ఛార్జర్స్ 82 పరుగుల స్కోరు వద్ద ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ బెంగళూరుతో జరిగింది.


రెండో అత్యల్ప స్కోరు ఢిల్లీ డేర్ డెవిల్స్ పేరిట ఉంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ మధ్య జరిగిన 2008 సెమీ ఫైనల్‌లో రెండో అత్యల్ప స్కోరు చేశారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ 87 పరుగులకు ఆలౌట్ అయింది. దీని తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ మూడో స్థానంలో ఉంది.


ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్రత్యేక రికార్డు సృష్టించింది. ప్లేఆఫ్స్‌లో ముంబై మూడో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్ రాయల్స్ పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 2008 సెమీ ఫైనల్‌లో ఆ జట్టు 105 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఓడించింది. ఇక 2012లో చెన్నై 86 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఇది రెండో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ముంబై 81 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది.


ఐపీఎల్‌ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. మే 26వ తేదీన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు మే 28వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.


లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో ఆకాష్ మధ్వాల్ తన స్పెల్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.