David Warner On DC vs RCB: ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడింది. కానీ ఒక్క విజయం కూడా రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో ఓడించింది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 174 పరుగులు చేసింది. దీంతో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌పై వరుసగా ఐదో ఓటమి తర్వాత కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడాడు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓటమి తర్వాత, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ, ‘మా జట్టు అన్ని విభాగాల్లో మెరుగవ్వాలని టాస్‌ సందర్భంగా నేను చెప్పాను. కానీ అలా జరగలేదు. పరుగుల ఛేదనకు దిగిన మేము చాలా త్వరగా మూడు వికెట్లు కోల్పోయాము. దీని కారణంగా మేము లక్ష్యాన్ని చేరుకోలేకపోయాము, అయితే ఈ వికెట్‌పై 175 పరుగుల లక్ష్యం అంత కష్టమేమీ కాదు.’ అన్నాడు. అంతే కాకుండా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని డేవిడ్ వార్నర్ అన్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడని డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్, ఫీల్డింగ్‌ను డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు.


‘బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మా జట్టు అద్భుతంగా రాణించింది. మైదానంలో మన ఆటగాళ్లు చూపిన ఎనర్జీ ఆహ్లాదకరంగా ఉంది. వచ్చే ఐదు రోజులు మాకు మ్యాచ్ లేదు. ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మా జట్టు బ్యాటింగ్‌లో రాణించాల్సి ఉంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యంపై దృష్టి పెట్టాలి.’ అన్నాడు. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు త్వరలో బలమైన పునరాగమనం చేస్తుందని డేవిడ్ వార్నర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.


ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విజయం లభించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు సాధించింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 151 పరుగులకు పరిమితం అయింది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (50: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ తరఫున మనీష్ పాండే (50: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్ సెంచరీ చేశాడు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిషెల్ మార్ష్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇది ఢిల్లీకి వరుసగా ఐదో ఓటమి. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది.