ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాతి సీజన్ కోసం జరిగే వేలం డిసెంబర్ 23వ తేదీ కొచ్చిలో జరగనుందని తెలుస్తోంది. సాధారణ మెగా వేలంలా కాకుండా ఇది చిన్న వేలం. గత వేలంలో తమ పర్సులో మిగిలిపోయిన డబ్బు, వారు విడుదల చేసిన ఆటగాళ్ల విలువ కాకుండా జట్లకు అదనంగా రూ.5 కోట్లు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.


గత ఏడాది వేలం తర్వాత, పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా రూ.3.45 కోట్లు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పర్స్‌లో రూ.2.95 కోట్లు ఉన్నాయి. ఈ జాబితాలో రూ.1.55 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రూ.95 లక్షలతో రాజస్థాన్ రాయల్, రూ.45 లక్షలతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉన్నాయి.


లక్నో సూపర్ జెయింట్స్ గత సంవత్సరం వేలంలో తమ దగ్గరున్న పర్స్ మొత్తం అవగొట్టేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు రూ.15 లక్షలు, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు తలో రూ.10 లక్షలు మిగిలాయి.


పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ 2022 వేలంలో ఏడుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసినందున ఎనిమిదో విదేశీ ఆటగాడితో తమ జట్లను నింపడానికి ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది. ఆరు ఫ్రాంచైజీలు గత సీజన్‌లో గాయం కారణంగా కొందరిని రీప్లేస్‌ చేశాయి. ఇప్పుడు ప్లేయర్ పరిమితి సరిపోయినట్లయితే రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌ని లేదా ఒరిజినల్ ప్లేయర్‌ల్లో ఒకరిని ఉంచుకోవాలా లేదా ఇద్దరినీ కొనసాగించాలా అని ఫ్రాంచైజీలు నిర్ణయించుకోవాలి.


ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తొలి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకోగా, రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, గరిష్టంగా 217 స్లాట్‌లలో 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ వేలంలో రూ.551.7 కోట్లు వెచ్చించారు. వీరిలో 107 మంది క్యాప్ ప్లేయర్లు, 97 మంది అన్‌క్యాప్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 137 మంది భారత ఆటగాళ్లను కొనుగోలు చేయగా, 67 మంది విదేశీ ఆటగాళ్లు వేర్వేరు జట్లలోకి వచ్చారు.