సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్ (Umran Malik) టీమ్‌ఇండియా (Team India)కు ఎంపికైతే ప్రపంచ క్రికెట్లో సునామీ సృష్టిస్తాడని మాజీ క్రికెటర్లు డేనియెల్‌ వెటోరీ, క్రిస్‌ లిన్‌ అంటున్నారు. అతడి వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా పర్యవేక్షించాలని పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ జరిగే ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై అతడు విధ్వంసం సృష్టించగలడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ, ఎన్‌సీఏ అతడిని తీర్చిదిద్దాలని సూచిస్తున్నారు.


ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో ఉమ్రాన్‌ మాలిక్‌ అద్భుతం చేశాడు. తన వేగంతో ఐదు వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చాడు. అతడి వేగానికి తట్టుకోలేక బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. టెయిలెండర్లు మాత్రమే కాకుండా టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లూ విలవిల్లాడుతున్నారు.


'బయట నుంచి చూస్తుంటే ఉమ్రాన్‌ మాలిక్‌ టీ20 ప్రపంచకప్‌కు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తోంది. అతడికి టీమ్‌ఇండియాలో చోటు దొరుకుతుందని అంచనా. ఎందుకంటే ఆస్ట్రేలియాలోని పిచ్‌లు బౌన్సీగా ఉంటాయి. కాకపోతే కుర్రాళ్లకు అనుభవం లేదు. అలాంటప్పుడు ఎవరిని డ్రాప్‌ చేయాలన్నా కష్టమే. కానీ అతడు ప్రపంచకప్‌ ఆడితే చూసేందుకు ఇష్టపడతాను. ఇంటర్నేషనల్‌ లెవల్లో అతడికి ఛాన్స్‌ దొరికితే ప్రపంచ క్రికెట్లో సునామీ సృష్టిస్తాడు. నేను ఇండియా సెలక్టర్‌ను కానందుకు లక్కీగా ఫీలవుతున్నా' అని క్రిస్‌ లిన్‌ అంటున్నాడు. 


ఉమ్రాన్‌ మాలిక్‌ ప్రతి బంతినీ 145+ వేగంతో వేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని డేనియెల్‌ వెటోరీ పేర్కొన్నాడు. 'కేవలం టెయిలెండర్లే కాదు బ్యాటర్లనూ అతడి వేగం భయపెడుతోంది. బౌలర్లు ఎక్కువగా 153-154 కి.మీ వేగంతో బంతులేయడం మనం అరుదుగా చూస్తుంటాం. మాలిక్‌లోని వైవిధ్యం ఇదే. బ్రెట్‌ లీ, షోయబ్‌ అక్తర్‌, షాన్‌ టైట్‌లా అత్యంత నిలకడగా వేగంగా బంతులే పేసర్లను మనం ఎక్కువగా చూడం. ఇప్పుడు ఉమ్రాన్‌ మాలిక్‌లో అలాంటి వేగం కనిపిస్తుండటం బాగుంది. అతడో ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారుతున్నాడు. ఇండియన్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐ, ఎన్‌సీఏ అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి. వర్క్‌లోడ్‌ను తగ్గించాలి. ఎందుకంటే తరచూ ఎక్కువ బౌలింగ్‌ చేస్తే రానురాను ఆ వేగం తగ్గిపోతుంది. ఏదేమైనా అతడిలోని అత్యుత్తమ ఆటతీరును వెలికితీయాలి' అని వెటోరీ అన్నాడు.


GT మ్యాచులో ఉమ్రాన్ బీభత్సం ఇదీ


భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ను ఉమ్రాన్‌ మాలిక్‌ తన పేస్‌తో భయపెట్టాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జట్టు స్కోరు 69 వద్ద శుభ్‌మన్‌ గిల్‌ వికెట్‌ ఎగరగొట్టాడు. ఆఫ్‌ స్టంప్‌ మీదుగా వచ్చిన బంతికి గిల్‌ బీట్‌ అయ్యాడు. ఇక పదో ఓవర్లో హార్దిక్‌ పాండ్యను వణికించాడు. అతడు వేసిన బౌన్సర్‌ బ్యాటు అంచుకు తగిలి థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డర్‌ చేతుల్లో పడింది.


దూకుడు ఆడుతున్న ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహానూ అతడే ఔట్‌ చేశాడు. 152 కి.మీ వేగంతో వేసిన ఆ బంతికి మిడిల్‌, లెగ్‌స్టంప్‌ ఎగిరి పడింది. 16వ ఓవర్లో అయితే ఆఖరి రెండు బంతుల్లో వికెట్లు పడగొట్టాడు. 148 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి డేవిడ్‌ మిల్లర్‌ లెగ్‌స్టంప్‌ను గాల్లోకి లేపింది. ఆ మరుసటి బంతికే అభినవ్‌ మనోహర్‌ను పెవిలియన్‌ పంపించాడు.