IPL 2022, SRH vs RR preview: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు (IPL 2022) ఐదో మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad), రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) తలపడుతున్నాయి. మహారాష్ట్రలోని పుణె ఇందుకు వేదిక. గతేడాది ఘోర ఓటములతో హైదరాబాద్‌ అభిమానులను నిరాశపరిచింది. మరోవైపు ఎంటర్‌టైన్‌ చేయడంలో తిరుగులేని రాజస్థాన్‌ ట్రోఫీ కోసం ఎదురు చూస్తోంది. మరి ఈ రెండింట్లో ఎవరిపై ఎవరిది పై చేయి? ఎవరి బ్యాటింగ్‌ లైనప్‌ ఎలా ఉంది? ఎవరి బౌలింగ్‌ లైన్‌ మెరుగ్గా ఉంది?


RR, SRH సమవుజ్జీలే


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌లో(SRH vs RR) ఒకరు ఎక్కువా కాదు! ఇంకొకరు తక్కువా కాదు! రెండు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 15 సార్లు ఐపీఎల్‌లో తలపడితే రాజస్థాన్‌ 7 సార్లు గెలిచింది. సన్‌రైజర్స్‌ 8 సార్లు విజయం సాధించింది. చివరిగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో రాజస్థాన్ మూడు గెలిస్తే హైదరాబాద్‌ రెండే గెలిచింది. గత సీజన్లో చెరోటి గెలిచారు.


Sanju Samson, Jos Buttler దబిడి దిబిడే





* 2020 నుంచి ఐపీఎల్‌లో కేవలం ఐదుగురు బ్యాటర్లు మాత్రమే 40 ప్లస్‌ సగటు, 140 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశారు. అందులో ఇద్దరు రాజస్థాన్‌లోనే ఉన్నారు. కెప్టెన్‌ సంజు శాంసన్‌ 54. 50 సగటు, 145 స్ట్రైక్‌రేట్‌తో అదరగొట్టగా జోస్‌ బట్లర్‌ 43 సగటు, 159 స్ట్రైక్‌రేట్‌తో దంచికొట్టాడు.


* ఐపీఎల్‌ పవర్‌ప్లేలో అత్యంత విజయవంతమైన సీమర్‌, స్పిన్నర్‌ రాజస్థాన్‌లోనే ఉన్నారు. ఐపీఎల్‌ 2020 నుంచి ట్రెంట్‌ బౌల్ట్‌ (21 వికెట్లు), అశ్విన్‌ (8 వికెట్లు) మించి పవర్‌ప్లేలో ఇంకెవ్వరూ రాణించలేదు.


* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దాదాపుగా 2021 బౌలింగ్‌ లైనప్‌నే తీసుకుంది. వీరిపై దేవదత్‌ పడిక్కల్‌కు మెరుగైన రికార్డులేదు. 94.21 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు.


RR, SRH Probable XI


రాజస్థాన్‌ రాయల్స్‌: యశస్వీ జైశ్వాల్‌, జోస్‌ బట్లర్‌, దేవదత్‌ పడిక్కల్‌, సంజు శాంసన్‌, షిమ్రన్‌ హెట్‌మైయిర్‌, రియాన్‌ పరాగ్‌, జేమ్స్‌ నీషమ్‌ / నేథన్‌ కౌల్టర్‌ నైల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: రాహుల్‌ త్రిపాఠి, అభిషేక్‌ శర్మ, కేన్‌ విలియమ్సన్‌, నికోలస్‌ పూరన్‌, అయిడెన్‌ మార్క్‌క్రమ్, అబ్దుల్‌ సమద్‌, వాషింగ్టన్‌ సుందర్‌, మార్కో జెన్‌సన్‌ / రొమారియో షెఫర్డ్‌, భువనేశ్వర్ కుమార్‌, టి.నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌