MI vs SRH, 1 Innings Highlights: ఐపీఎల్‌ 2022లో 65వ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) దంచికొట్టింది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసింది. 6 వికెట్లు నష్టపోయి ముంబయి ఇండియన్స్‌కు 194 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. రాహుల్‌ త్రిపాఠి (76; 44 బంతుల్లో 9x4, 3x6) చితక్కొట్టాడు. విలువైన హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడికి తోడుగా ప్రియమ్‌ గార్గ్‌ (42; 26 బంతుల్లో 4x4, 2x6), నికోలస్‌ పూరన్‌ (38; 22 బంతుల్లో 2x4, 3x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడేశారు. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీకి పంపించేశారు. రమన్‌దీప్‌ 3 వికెట్లు తీశాడు.


త్రిపాఠి మామూలుగా కొట్టలేదు


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు (SRH) శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (9) జట్టు స్కోరు 18 వద్ద డేనియెల్‌ సామ్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అయితే కేన్ విలియమ్సన్‌ బదులు ఓపెనింగ్‌కు వచ్చిన ప్రియమ్‌ గార్గ్‌ రెచ్చిపోయాడు. రాహుల్‌ త్రిపాఠితో కలిసి బీభత్సమైన షాట్లు ఆడేశాడు. నిలకడగా ఆడుతూనే దూకుడుగా బౌండరీలు  కొట్టేశాడు. రెండో వికెట్‌కు 43 బంతుల్లో 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పదో ఓవర్‌ ఆఖరి బంతికి గార్గ్‌ను రమన్‌దీప్‌ ఔట్‌ చేశాడు. మరోవైపు త్రిపాఠి సొగసైన షాట్లు ఆడాడు. 32 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. అతడికి తోడుగా నికోలస్‌ పూరన్‌ సిక్సర్లు, ఫోర్లు బాదేయడంతో 15.2 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోరు 150కి చేరుకుంది. మూడో వికెట్‌కు 42 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యం అందించిన ఈ జోడీని పూరన్‌ను ఔట్‌ చేయడం ద్వారా మెరిడీత్‌ విడదీశాడు. అప్పటికి స్కోరు 172. మరో 3 పరుగుల వ్యవధిలోనే త్రిపాఠి, మార్‌క్రమ్‌ను రమన్‌దీప్‌ ఔట్‌ చేశాడు. కేన్‌ (8), సుందర్‌ (9) కలిసి స్కోరును 193కు తీసుకెళ్లారు.