IPL 2022 Tilak Varma could be an all format India batter says Sunil Gavaskar: ముంబయి ఇండియన్స్‌ యువ క్రికెటర్‌ తిలక్‌ వర్మ (Tilak Varma) పేరు ట్విటర్లో ట్రెండ్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ అతడి పేరును ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందుకో కారణం ఉంది. క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar on Tilak varma) అతడిపై ప్రశంసలు కురిపించాడు. రోహిత్‌ శర్మ అన్నట్టుగా టీమ్‌ఇండియాకు మూడు ఫార్మాట్లలో ఆడగల సత్తా అతడికి ఉందని అన్నాడు. త్వరలోనే జాతీయ జట్టు తలుపు తడతాడని అంచనా వేశాడు. సన్‌రైజర్స్‌తో మ్యాచుకు ముందు అతడి గురించి మాట్లాడాడు.


'తిలక్‌ వర్మ గురించి రోహిత్‌ శర్మ సరిగ్గానే చెప్పాడు. ఆ కుర్రాడు టీమ్‌ఇండియాకు అన్ని ఫార్మాట్లలో ఆడగలడు. మరికాస్త ఎక్కువ శ్రమించడం, ఫిట్‌నెస్‌ కాపాడుకోవడం, టెక్నిక్‌ను మరింత మెరుగు పర్చుకోవాల్సిన బాధ్యత తిలక్‌పై ఉంది. హిట్‌మ్యాన్‌ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం అతడికుంది' అని సునిల్‌ గావస్కర్‌ అన్నాడు.


'తిలక్‌ వర్మ బేసిక్స్‌ చాలా బాగున్నాయి. సాంకేతికంగానూ అతడి బ్యాటింగ్‌ బాగుంది. అతడు బంతి వస్తున్న లైన్‌కు సరిగ్గా వెనకాలే ఉంటున్నాడు. స్ట్రెయిట్‌ బ్యాటుతో ఆడుతున్నాడు. ఫ్రంట్‌ ఫుట్‌పై డిఫెండ్‌ చేస్తున్నప్పుడు బ్యాటు ప్యాడ్లకు దగ్గరగా ఉంటోంది. అంటే అతడి బేసిక్స్‌ అన్నీ సరిగ్గా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి కాబట్టి అతడికప్పుడు టెంపర్‌మెంట్‌ అవసరం. ప్రస్తుతం అతడి టెంపర్‌మెంట్‌ అద్భుతంగా అనిపిస్తోంది. అతడిలా కొనసాగుతాడని ఆశిస్తున్నా' అని గావస్కర్‌ తెలిపాడు. 


ముంబయి ఇండియన్స్‌ తరఫున ఈ సీజన్లో తిలక్‌ వర్మ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచులో 32 బంతుల్లో చేసిన 34 పరుగులు ఎంతో కీలకంగా మారాయి. ఇప్పటి వరకు 12 మ్యాచులాడిన తిలక్‌ 368 పరుగుల చేశాడు. 132.85 స్ట్రైక్‌రేట్‌తో 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఇప్పటి వరకు ముంబయి సాధించిన విజయాల్లో సూర్యకుమార్‌ యాదవ్‌తో కలిపి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.