ipl qualification scenariosAdvantage DC going into final week : ఐపీఎల్‌ 2022 లీగ్‌ స్టేజ్‌ ఆఖరి వారానికి చేరుకుంది. ఇప్పటికైతే ఒకే ఒక్క జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) నేతృత్వంలోని గుజరాత్‌ టైటాన్స్‌ (GT) 20 పాయింట్లతో అగ్రస్థానంలో సెటిలైంది. 16 పాయింట్లు దక్కినప్పటికీ క్వాలిఫై అయ్యేందుకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG), రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) మరో మ్యాచ్‌ వరకు ఆగాల్సి వస్తోంది. సందట్లో సడేమియాలా వరుస విజయాలు సాధించిన దిల్లీ క్యాపిటల్స్‌ (DC) మరో నాలుగు జట్లకు హార్ట్‌ అటాక్‌ తెప్పించింది. బెంగళూరునైతే (RCB) వెంటిలేటర్‌పై పడుకోబెట్టింది. దాంతో ప్లేఆఫ్స్‌ సినారియో మొత్తం మారిపోయింది.


LSG, RR కాస్త బేఫికర్‌!


ప్రస్తుతం 16 పాయింట్లు దక్కినప్పటికీ నెట్‌రన్‌రేట్‌ తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ (+0.304), లక్నో సూపర్‌ జెయింట్స్‌ (+0.262) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి. ఇవి రెండూ 13 మ్యాచులాడాయి. ఇంకో చెరో మ్యాచ్‌ మాత్రమే మిగిలుంది. లక్నో ఎప్పుడో ప్లేఆఫ్స్‌ చేరుకోవాలి. వరుస ఓటములు దానికి అడ్డంకిగా మారిపోయాయి. దాదాపుగా ఈ రెండు జట్లు గెలుపుతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌ చేరుకొనే అవకాశాలైతే మెరుగ్గా ఉన్నాయి.


జస్ట్‌..  ఓడిపోతే చాలు!


కోల్‌కతా చేతిలో లక్నో, చెన్నై చేతిలో రాజస్థాన్‌ ఓడిపోయినప్పటికీ ప్లేఆఫ్స్‌ చేరుకొనే ఛాన్స్‌ ఉంది. అయితే నెట్‌ రన్‌రేట్ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఈ మ్యాచుల్లో లక్నో గెలిస్తే 18 పాయింట్లతో రెండులో ఉంటుంది. వారు ఓడి రాజస్థాన్‌ గెలిస్తే దానిదే రెండో స్థానం అవుతుంది. అలా కాకుండా రెండూ గెలిస్తే మళ్లీ రన్‌రేట్‌ ఆధారంగా 2, 3 స్థానాలు ఫిక్స్‌ చేస్తారు. కాబట్టి వీటిలో గెలిచేందుకు ఈ రెండు జట్లు కచ్చితంగా శ్రమిస్తాయి. లక్నో వరకు 75, రాజస్థాన్‌ 80 పరుగుల తేడాతో ఓడిపోకపోతే చాలు!


RCBకి DC సెగ


మరోవైపు దిల్లీ క్యాపిటల్స్‌ (DC), రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 14 పాయింట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరు (-0.323)కు రన్‌రేట్‌ శాపంగా మారింది. దిల్లీకి (+0.255) వరంగా పరిణమించింది. ఈ రెండు జట్లు ఇప్పుడు చెరో మ్యాచ్‌ ఆడతాయి. మే 21న వాంఖడేలో ముంబయితో దిల్లీ తలపడుతుంది. మే 19న గుజరాత్‌తో బెంగళూరు పోరాడుతుంది. తర్వాతి మ్యాచుల్లో లక్నో, రాజస్థాన్‌ ఓడి మెరుగైన రన్‌రేట్‌తో ముంబయిపై గెలిస్తే పంత్‌ సేన ఏకంగా టాప్‌-2కు చేరగలదు.


లక్నో, రాజస్థాన్‌ ఓడిపోకుండా పంత్‌ సేన గెలిస్తే నాలుగో స్థానంలో ఉంటుంది. దాంతో బెంగళూరు నాకౌట్‌ అవుతుంది. ఒకవేళ ఆర్సీబీ ప్లేఆఫ్‌ చేరుకోవాలంటే కచ్చితంగా గుజరాత్‌ను 75 రన్స్‌ తేడాతో ఓడించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు! ఇక పంజాబ్‌, కోల్‌కతా, సన్‌రైజర్స్‌ మిగతా అన్ని మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్స్‌ చేరడం చాలా కష్టం. దిల్లీతో పోలిస్తే కొందరివి నెగెటివ్‌, మరికొందరివి తక్కువ రన్‌రేట్‌. మొత్తంగా ఆర్సీబీనీ దిల్లీ 'ఈ సాలా కప్‌ నమదే' కాకుండా చేసేసింది.