IPL 2022 rohit sharma virat kohli poor form might hurt team india in t20 worldcup 2022 : ఆ ఇద్దరూ భారత్‌కు రెండు కళ్లు! ఇద్దరిలో ఏ ఒక్కరు నిలిచినా పరుగుల వరదే. ఇక ఇద్దరూ ఆడితే మైదానమే చిన్నబోతుంది. ఒకరు లాఫ్టెట్‌ షాట్లతో అలరిస్తే మరొకరు చక్కని కవర్‌డ్రైవ్‌లతో మురిపిస్తారు. మ్యాచు సాగే కొద్దీ వీరిద్దరి జోరూ పెరుగుతుంది. మైదానంలో హోరూ పెరుగుతుంది. అలాంటిది ఐపీఎల్‌ 2022లో వారిద్దరూ డీలాపడ్డారు. టీ20 ప్రపంచకప్‌ ఆశలపై సందిగ్ధం పెంచుతున్నారు. వారే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.


వీక్‌నెస్‌ కనిపెట్టేశారు?


టీమ్‌ఇండియాకు అత్యంత కీలకమైన ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ! భారత జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ గెలవాలంటే వీరిద్దరూ ఫామ్‌లో ఉండాల్సిందే. లేదంటే ఆశలు సన్నగిల్లుతాయి. సెప్టెంబర్లో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. అప్పుడు బాగా ఆడాలంటే ఇప్పట్నుంచే మూమెంటమ్‌ క్యారీ చేయడం అవసరం. టాప్‌ ఆర్డర్‌ బాగా ఆడితేనే కప్‌ గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ, వన్‌డౌన్‌లో కోహ్లీ ఈ ఐపీఎల్‌లో అస్సలు బాగా ఆడటం లేదు. రస్టీగా కనిపిస్తున్నారు. మునుపటి ఈజ్‌ కనిపించడం లేదు. ప్రత్యర్థులు వీరిద్దరి వీక్‌నెస్‌ను కనిపెట్టి సులువుగా ఉచ్చు బిగిస్తున్నారు. ఔట్‌ చేస్తున్నారు.


విరాట్‌ థింక్‌ ఇట్‌!


ఐపీఎల్‌లో విరాట్‌ 207 ఇన్నింగ్సులు ఆడాడు. 36.58 సగటుతో 6,402 పరుగులు చేశాడు. 2010 నుంచి ప్రతి సీజన్లోనూ 300+ పరుగులు చేశాడు. 7 సీజన్లలో 400 - 973 వరకు పరుగులు చేశాడు. అలాంటిది ఈ సీజన్లో ఒక్కసారిగా డీలా పడ్డాడు. ఈ సీజన్లో 8 మ్యాచులాడి 17 సగటు, 122 స్ట్రైక్‌రేట్‌తో 119 పరుగులే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ అయినా లేదు. కొట్టిన సిక్సర్లు 2. బౌండరీల సంఖ్య 10 దాటలేదు. రీసెంట్‌ స్కోర్లు 41*, 12, 5, 48, 1, 12, 0, 0గా ఉన్నాయి. అతడిలో మునుపటి ఉత్సాహం, మూమెంటమ్‌ కనిపించడం లేదు. ప్రత్యర్థులు పన్నుతున్న ఉచ్చులో ఊరికే పడిపోతున్నాడు. కాసేపు మైదానంలో సెటిల్‌ అవ్వడానికి ప్రయత్నించడమే లేదు. దేహానికి దూరంగా ఆఫ్‌సైడ్‌ ది ఆఫ్‌స్టంప్‌గా వేస్తున్న బంతుల్ని వెంటాడి మరీ ఔటవుతున్నాడు. ఈ సీజన్‌ ముగిశాక అతడు రిజువెనేట్‌ అవ్వడం చాలా ముఖ్యం. 


రోహిత్‌ నో హిట్‌!


టీమ్‌ఇండియాకు రోహిత్‌ కెప్టెన్‌ అయ్యాడంటే ఐపీఎల్‌లో ఐదుసార్లు ట్రోఫీలు గెలిపించడమే ప్రధాన కారణం. అలాంటిది ఈ సీజన్లో అటు కెప్టెన్‌గా ఇటు ఆటగాడిగా రోహిత్‌ ఫెయిల్‌ అయ్యాడు. ఆటగాళ్ల కొరత వేధించడం ఒకటైతే బరువు పెరగడం, మైదానంలో రస్టీగా కనిపిస్తుండటం మరొకటి. ఇతరుల వైఫల్యాలు తన ఆటతీరును ప్రభావం చేసినట్టుగా అనిపిస్తోంది. ఐపీఎల్‌లో 220 మ్యాచులు అనుభవం అతడి సొంతం. 130 స్ట్రైక్‌రేట్‌, 30.61 సగటుతో 57265 పరుగులు చేశాడు. ఒక్క సీజన్లో కూడా 285కు తక్కువ పరుగులు చేయలేదు. యావరేజ్‌గా 400 పరుగులు చేస్తుంటాడు. అలాంటిది ఈ సీజన్లో 7 మ్యాచుల్లో 16 సగటు, 126 స్ట్రైక్‌రేట్‌తో 114 పరుగులు చేశాడు. కొట్టింది 6 సిక్సర్లు, 12 ఫోర్లు. 41, 10, 3, 26, 28, 6, 0 రీసెంట్‌ స్కోర్లు. పుల్‌షాట్లు ఆడటం రోహిత్ బలం. అదే షాట్ ఆడుతూ ఔటవ్వడం బలహీనత. ఇక వేగంగా వచ్చే ఇన్‌స్వింగిగ్‌ డెలివరీలకు ఇబ్బంది పడుతుంటాడు. ప్రత్యర్థులు వీటినే ప్రయోగిస్తున్నారు. ఒక జట్టు మెగా టోర్నీ గెలవాలంటే ఆటగాళ్లంతా సమష్టిగా ఆడటం ముఖ్యం. ఆ బాధ్యత కెప్టెన్‌దే. మరి రోహిత్‌ ఏం చేస్తాడో?