IPL 2022 – Shane Watson Joins DC: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో దిల్లీ క్యాపిటల్స్‌ చకచకా నిర్ణయాలు తీసేసుకుంటోంది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ఎంఎస్‌ ధోనీకి అత్యంత నమ్మకస్థుడైన షేన్ వాట్సన్‌ దిల్లీ శిబిరానికి చేరిపోయాడు. ఐపీఎల్‌ 2022 సీజన్లో అతడు దిల్లీకి సహాయ కోచ్‌గా పనిచేయనున్నాడని తెలిసింది. మహ్మద్‌ కైఫ్‌ స్థానంలో వాట్సన్‌ను తీసుకున్నట్టు సమాచారం.


ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు షేన్‌ వాట్సన్‌ అద్భుతమైన విజయాలు అందించాడు. భీకరమైన ఓపెనర్‌గా ప్రత్యర్థులను వణికించాడు. సీఎస్‌కే, ధోనీకి అతడిపై ఎంతో గురి. 40 ఏళ్ల వాట్సన్‌ 2020లో ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. అతడిని దిల్లీకి తీసుకురావడంలో ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ కీలక పాత్ర పోషించాడని సమాచారం. మొదట్లో అతడు అంగీకరించకపోయినా సుదీర్ఘంగా చర్చించి ఒప్పించినట్టు తెలిసింది. వాట్సన్‌ 2008లో రాజస్థాన్‌ రాయల్స్‌, 2018లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌ విజేతగా నిలిచాడు.


ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్ హెడ్‌కోచ్‌గా రికీ పాంటింగ్‌ ఉన్నాడు. సహాయ కోచులుగా షేన్‌ వాట్సన్‌, ప్రవీణ్‌ ఆమ్రె, అజిత్‌ అగార్కర్‌ ఉండనున్నారు. జేమ్స్‌ హోప్స్‌ను ఫాస్ట్‌బౌలింగ్‌ కోచ్‌, జట్టు స్కౌట్‌, సలహాదారుగా సాబా కరీమ్‌ను ఎంచుకున్నారు. వాట్సన్‌ దాదాపుగా బ్యాటింగ్‌ కోచ్‌గా ఉంటాడు. ఇక అజిత్‌ అగార్కర్‌ బౌలింగ్‌ విభాగాన్నే చూసుకుంటాడని తెలిసింది. గత సీజన్‌ వరకు పనిచేసిన మహ్మద్‌ కైఫ్‌, అజయ్‌ రాత్రా దిల్లీతో బంధం తెంచుకున్నారు.


ఐపీఎల్‌ 2022 వేలంలో దిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతమైన క్రికెటర్లను దక్కించుకుంది. శిఖర్ ధావన్‌ను కోల్పోయినప్పటికీ డేవిడ్‌ వార్నర్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. మిచెల్‌ మార్ష్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియాను దక్కించుకుంది. దిల్లీ జట్టు మరోసారి బలంగా కనిపిస్తోంది.